Site icon NTV Telugu

Governor Tamilisai: కేసీఆర్‌ వస్తామన్నారు.. రాలేదు.. ఎందుకో తెలియదు

Governor Tamilisai Soundara

Governor Tamilisai Soundara

మరోసారి రాజ్‌భవన్‌కు దూరంగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. అయితే, ఇవాళ వస్తున్నారంటూ ముందుగా సమాచారం ఇచ్చి.. చెప్పకుండానే దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌ భవన్‌ వేదికగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలు హాజరు కాకపోవడం చర్చగా మారింది..

Read Also: Road Accident: బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు హైదరాబాద్‌ వాసులు మృతి

కాగా, 2020లో నిర్వహించిన ఎట్‌ హోమ్‌కు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు.. గత ఏడాది కరోనా కారణంగా.. ఎట్‌ హోమ్‌ నిర్వహించలేదు.. ఈ రోజు మాత్రం రాత్రి 7 గంటల సమయంలో ఆయన రాజ్‌భవన్‌కు వస్తారని ముందుగా సమాచారం ఇచ్చారట.. సీఎం వస్తున్నారని.. చాలా సేపు గవర్నర్‌.. కార్యక్రమాన్ని ప్రారంభించకుండా వేచిచూశారు.. ఇక, వచ్చేలా లేరని భావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. కేసీఆర్‌ హాజరు కాకపోవడంపై గవర్నర్‌ తమిళిసై స్పందిస్తూ.. రాత్రి 7 గంటల సమయంలో సీఎం కేసీఆర్‌.. రాజ్‌భవన్‌కు వస్తారని ప్రగతి భవన్‌ నుంచి రాజ్‌భవన్‌కు సమాచారం ఇచ్చారు. కానీ, ఎందుకు రాలేదో నాకు తెలియలేదు అన్నారు గవర్నర్‌.. కనీసం రావడం లేదన్న సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, గవర్నర్ తమిళిసైకి, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగిపోతోందన్న ప్రచారం ఎప్పటి నుంచో జరగుతూనే ఉంది.. ఇక, మధ్యలో ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ప్రత్యక్షంగా.. పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు గవర్నర్‌.. కానీ, గత జూన్ నెలలోనే ఫుల్‌స్టాప్ పడింది. తొమ్మిది నెలలు రాజ్‌భవన్ వైపు కన్నెత్తి చూడని కేసీఆర్.. హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైని ఆప్యాయంగా పలకరించుకున్నారు.. ఇక అంతా సర్దుకుందా అనే చర్చ సాగుతోన్న సమయంలోనే.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రాకపోవచ్చని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. కేంద్ర రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతోనే కేసీఆర్‌ పదే పదే ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారా.. అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ అవకాశం లేదు అని చెప్పుకొచ్చారు తమిళిసై.. ఇదే సమయంలో కేసీఆర్‌ ఎప్పుడూ నా సోదరుడే. నేను ఎప్పడూ ఆయనకు సోదరినే అని కూడా కామెంట్ చేశారు.. ఈ నేపథ్యంలో.. ఇవాళ కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వస్తారని ముందు సమాచారం ఇచ్చినా.. రాకపోవడంతో.. మళ్లీ రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య దూరం పెరుగుతుందా అనే చర్చ మొదలైంది.

Exit mobile version