కేంద్రం ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ మరియు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా కేంద్రం విధానాలను తప్పుబట్టారు. నేరుగా పల్లెలకు కేంద్రం నిధులు పంపడం చిల్లర వ్యవహారంగా అభివర్ణించిన ఆయన.. ఢిల్లీ నుంచి నేరుగా కేంద్రమే పథకాలు అమలు చేయాలనుకోవడం సరికాదు, స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయన్నారు.
Read Also: Minister Amarnath: రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం
పంచాయతీ రాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా మండిపడ్డారు సీఎం కేసీఆర్. జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్న ఆయన.. రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదని హితవుపలికారు. 75 సంవత్సరాల అమృత మహోత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయి. త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారు. విద్య, వైద్యం అనేక రంగాలల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధులలో జోక్యం చేసుకోవానుకోవడం సమర్థనీయం కాదని సూచించారు కేసీఆర్.
