NTV Telugu Site icon

జల జగడం.. నీటి పారుదలశాఖపై కేసీఆర్‌ సమీక్ష

KCR

KCR

జల జగడం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది.. మాటల యుద్ధం, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఎవ్వరు అడ్డుకుంటారో మేం చూస్తాం అని కొందరు అంటుంటే.. మేం అడ్డుకునే తీరుతాం అనే విధంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఇటీవల ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు కాకరేపుతున్నాయి.. అయితే, ఇవాళ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన.. జల వివాదం నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించనట్టు తెలుస్తోంది.. ఈనెల 9వ తేదీన జరగబోయే కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే కాగా.. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు.. ప్రధానికి, కేంద్ర మంత్రులకు, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదులు అందగా.. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కూడా పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.