NTV Telugu Site icon

TRS MLA’s Trap Issue: ప్రగతి భవన్‌లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. కాసేపట్లో కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌..

Kcr

Kcr

ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది.. ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలతో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీ డీల్‌కు ప్రయత్నించడం.. ఆ ఎమ్మెల్యేలే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడం పెద్ద రచ్చగా మారింది.. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టులు, పదవులు ఆశ చూపిన వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్‌ చేస్తోంది.. డీల్‌ సమయంలో.. ఢిల్లీలోని పెద్దలతోనూ మాట్లాడించే ప్రయత్నాలు జరిగినట్టు కూడా తెలుస్తోంది.. మొత్తంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా గుట్టును రట్టు చేశారు.. ఆడియో, వీడియో రికార్డింగ్‌లు సహా అన్ని ఆధారాలతో ఈ భారీ డీల్‌కు యత్నించినవారిని పట్టుకున్నారు. హైదరాబాద్‌ నగర శివార్లలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లో ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ బాగోతం మొత్తం బయటపడగా.. ఆ తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. రాత్రి ప్రగతిభవన్‌లోనే ఉన్నారు ఎమ్మెల్యేలు.. అయితే, ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది.. పైసలు, పనులు, పదవులు ఆశచూపి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారంపై బీజేపీని టార్గెట్‌ చేసి ఆయన నిప్పులు చెరగనున్నారని సమాచారం.

Read Also: Ration Mafia: రూట్‌ మార్చిన రేషన్‌ మాఫియా.. రైళ్లలో సరిహద్దులు దాటుతోన్న బియ్యం..!

కాగా, పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.. అయితే, దీనిపై అప్రమత్తమైన ఎమ్మెల్యేలు తమకు ఫిర్యాదు చేశారని.. తమకు డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎర చూపించి పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో.. పక్కా స్కెచ్‌తో ఈ ఆపరేషన్‌ నిర్వహించామని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఇప్పటికే వెల్లడించారు.. ఆ ముగ్గురిలో ఒకరు ఫరీదాబాద్‌ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, మూడో వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ గా తెలిపారు.. ఈ డీల్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ సాగుతుందని పేర్కొన్నారు.. అయితే, ఇవాళ టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మీడియా ముందుకు రానుండడంతో.. ఈ భారీ స్కెచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన వెల్లడించనున్నారని తెలుస్తోంది.. ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎవరు? ఎలా సంప్రదించారు..? వీరు అక్కడికు ఎలా వెళ్లారు..? తమకు ముందుగానే ఉన్న సమాచారం ఏంటి..? తెలంగాణలో టీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టడానికి బీజేపీ చేస్తున్న కుట్రలు..! ఇలా అనేక విషయాలను కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు.. సాధారణంగా కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టాడంటేనే అనేక విషయాలు చెబుతుంటారు..? ఇప్పుడు భారీ కుట్రే బయటపడిన సందర్భంలో ఆయన మీడియా ముందుకు రానుండడం ఆసక్తికరంగా మారింది..