తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ నెల 11, 12 తేదీల్లో జనగామ, యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా జిల్లాలలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన భవనాలను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ సమీకృత భవనాలను ప్రభుత్వం నిర్మించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం జనగామలో కలెక్టరేట్ భవన సముదాయాలను, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. శనివారం భువనగిరిలో కలెక్టరేట్ భవనాలను, అనంతరం యాదాద్రిలో ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా నూతనంగా కట్టిన ప్రెసిడెన్షియల్ సూట్‌ను సీఎం ప్రారంభిస్తారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.