Site icon NTV Telugu

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ సర్కారు భారీ నజరానా

పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలు వాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఆయన స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు కోటి రూపాయల రివార్డును సీఎం కేసీఆర్ ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో మంగళవారం నాడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను సకిని రామచంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

Read Also: దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి: సీఎం కేసీఆర్

ఈ సందర్భంగా అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సకిని రామచంద్రయ్యను సీఎం కేసీఆర్ అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రామచంద్రయ్య యోగ క్షేమాలను సిఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలం, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు.

అటు గత ఏడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు కూడా రూ.కోటి నజరానాను కేసీఆర్ ప్రకటించారు. కనకరాజు స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామం. గత 55 ఏళ్లుగా ఆయన గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. కనకరాజు ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Exit mobile version