NTV Telugu Site icon

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌..? కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న కేబినెట్

CM KCR

క‌రోనా మ‌హ‌మ్మారి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ఆలోచ‌న చేస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం.. మొద‌ట‌ల్లో ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కే స‌డ‌లింపులు ఇచ్చిన స‌ర్కార్.. ఆ త‌ర్వాత స‌డ‌లింపుల స‌మ‌యాన్ని ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు పెంచింది.. కేసులు త‌గ్గ‌డంతో.. ఆ వెసులు బాట‌ను 12 గంట‌ల ఇచ్చింది. దీంతో.. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపు.. ఆపై లాక్‌డౌన్ అమ‌లు చేశారు. ఇక‌, ఇప్పుడు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం ప‌ట్ట‌డంతో.. లాక్‌డౌన్‌ను పూర్తిగా సడలించే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.. ఇవాళ సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల రాష్ట్ర కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.. లాక్‌డౌన్‌, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత సీజనల్‌ అంశాలు, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోత, జలవిద్యుత్‌ ఉత్పత్తి తదితర అంశాలపై చ‌ర్చించ‌నున్నారు. ముఖ్యంగా ఇవాళ్టితో ముగియ‌నున్న లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా? లేదా మరిన్ని సడలింపులు ఇవ్వాలా? మొత్తానికే లాక్‌డౌన్ తీసేయాలా? అనే దానిపై చ‌ర్చించి ఓ నిర్ణ‌యం తీసుకోనున్నారు.

అయితే, ఈనెల 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలు ఎక్కువ‌గా కనిపిస్తున్నాయి. నైట్‌కర్ఫ్యూ మాత్రం క‌ఠినంగా అమ‌లు చేస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లు ఉన్నారు.. పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు వీలుగా రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ద‌శ‌గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు కోవిడ్ థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో.. మ‌హ‌మ్మారి మ‌ళ్లీ పంజా విసిరితే ఎలా ఎదుర్కోవాలి అనే ప్ర‌ణాళిక‌ల‌పై కూడా కేబినెట్ ఫోక‌స్ పెట్టే అవ‌కాశం ఉంది. ఇక‌, ఈ సారి సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్తున్న నేపథ్యంలో పంటల సాగుపై మంత్రివర్గం పలు అంశాలను చర్చించనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి వివిధ రిజర్వాయర్లను నింపడం, అక్కడి నుంచి చెరువులు, కుంటలను నింపడంపైనా చర్చించనున్నారు. ఇదే స‌మ‌యంలో.. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా చర్చించే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.