NTV Telugu Site icon

కేసీఆర్‌ ఆ లేఖ బయటపెట్టాలి.. లేదంటే రాజీనామా చేయాలి..!

రైతుల పాలిట తెలంగాణ సీఎం రాబందులా మారారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌… వరి బంద్ పథకాన్ని కేసీఆర్‌ స్టార్ట్ చేసిండు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. రైతులు వరి పండించకుండా ఏమి పంట వేయాలో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయలేదు.. ముఖ్యమంత్రి కన్ఫ్యూజ్ లో ఉంటాడు.. ఈయన కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేసిన బండి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రైతులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు.. ఇక, ప్రతి గింజ కొంటామని కేంద్రం చెప్పిందన్న ఆయన.. వరి కొనము అనే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు రుజువు ఉందా? అని ప్రశ్నించారు.. ఉంటే బయట పెట్టాలని సవాల్‌ చేశారు.

ఇక, కేసీఆర్‌ మిడ్‌నైట్‌ ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు బండి సంజయ్‌.. ప్రతీ పంటకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వాలి.. ఏ పంట ఎంత మేరకు అమ్ముతావో ముందు చెప్పాలి.. ఎంత ఖర్చు చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పిచ్చిపిచ్చి మాటలు కేసీఆర్ మాట్లాడొద్దు అని వార్నింగ్‌ ఇచ్చిన సంజయ్.. రైస్ మిల్లర్ల తో కేసీఆర్‌ కుమ్మక్కైయ్యారు.. గతంలో కేంద్రానికి ఇస్తామన్న బియ్యం ఇవ్వకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు, మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వరి వేస్తే ఉరే అని ముఖ్యమంత్రి చెప్పడంతో నలుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. మరోవైపు.. కేంద్రం రా రైస్ కొనడానికి సిద్ధంగా ఉంది.. రైతులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పిన ఆయన.. ముఖ్యమంత్రి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.. ధాన్యం కొనుగోలు చేయబోము అని ఎవరు చెప్పారో ముఖ్యమంత్రి లేఖ బయట పెట్టాలి.. లేదంటే కేసీఆర్ రాజీనామా చేయాలని అని డిమాండ్‌ చేశారు. రేపటి నుంచి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్న బండి.. రైతుల మీద వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ పై ఫిర్యాదు చేస్తామన్నారు.. అధికారులు హద్దుల్లో ఉండాలని సూచించారు. ఇక, మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. ఎన్నికల కమిషన్ మంత్రి పై, కొన్ని ప్రజా సంఘాలపై చర్యలు తీసుకోవాలని కోరారు బండి సంజయ్‌.