Site icon NTV Telugu

Bandi Sanjay: టీఆర్ఎస్ ప్లాన్ ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అకారణంగా రేవంత్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారని ఆయన గుర్తుచేశారు. మంత్రి హరీష్‌రావు కేంద్రాన్ని తిడుతుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాక్షస ఆనందం పొందారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో 270 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఆ తరువాత ఎన్నికల్లో తుడుచుకుపోయిందన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కుదరదన్నారు. అసలు బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన త‌ప్పేంటి అని, స‌భ‌కు ఎలాంటి ఆటంకం కలిగించకపోయినా, ఏ కారణం లేకుండా ముంద‌స్తుగా ప్లాన్ చేసుకుని బీజేపీ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. గ‌వ‌ర్నర్‌ను శాస‌న‌స‌భ‌కు ఆహ్వానించ‌కుండా అవ‌మానించిన చ‌రిత్ర టీఆర్ఎస్ పార్టీది అన్నారు. అసలు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.

హరీష్‌రావు బడ్జెట్ నేతి బీరకాయలో నెయ్యిలాగా ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఇది అబద్దాల బడ్జెట్ అని.. గత బడ్జెట్‌లో కేటాయించింది ఎంత ఖర్చు చేశారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. పార్లమెంట్‌ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు ఎన్ని రోజులు అడ్డుకున్నారో చెప్పాలని.. అక్కడ టీఆర్ఎస్ ఎంపీలు పోడియం దగ్గర ఆందోళన చేశారని బండి సంజయ్ గుర్తుచేశారు. టీఆర్ఎస్ సభ్యులు కూడా లోక్ సభలో ఆందోళన చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కే అసెంబ్లీలో కూర్చునే అధికారం లేదన్నారు. గవర్నర్‌ను కలుస్తున్నాం అని.. రాష్ట్రపతిని కూడా కలుస్తామని.. ఆయన అపాయింట్‌మెంట్ అడుగుతున్నామని బండి సంజయ్ తెలిపారు.

ప్రజా సమస్యలపై తాము న్యాయపరంగా కొట్లాడతామని.. ప్రజల మధ్య నిరసనలు తెలుపుతామని బండి సంజయ్ వెల్లడించారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని.. తెలంగాణలో నియంత పాలన కొనసాగనివ్వమని స్పష్టం చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని.. ఈ పోయే ప్రభుత్వానికి అబద్దాలు ఎక్కువ అని బండి సంజయ్ విమర్శలు చేశారు. బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల‌పై విధించిన స‌స్పెన్షన్‌ను త‌క్షణ‌మే ఎత్తేయాల‌ని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Exit mobile version