Site icon NTV Telugu

Telangana Assembly: 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ. విద్యార్థుల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించనున్న భట్టి.

Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ శాసన సభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6 నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను ఎప్పటివరకు కొనసాగించాలనేది ఆ రోజు జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌లో నిర్ణయిస్తారని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తెలిపారు. అజెండాను కూడా ఆ రోజే చర్చించి ఖరారు చేస్తారని చెప్పారు. మునుగోడు శాసన సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించటంపై అధికార పార్టీ టీఆర్ఎస్‌ ప్రధానంగా ఫోకస్‌ పెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తలెత్తిన వరదలతోపాటు శాంతిభద్రతలపైన, ఇతర అంశాల మీద చర్చ జరపనుంది.

ఈ సెషన్‌లో కొన్ని బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తోంది. బడ్జెట్‌ సమావేశాలు మార్చి 7న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీని ప్రొరోగ్‌ చేయకపోవటంతో 6వ తేదీన ప్రారంభంకానున్న సమావేశాలను వాటికి కొనసాగింపుగానే భావించాల్సి ఉంటుంది. గత సమావేశాల తొలి రోజు సస్పెండ్‌ అయిన బీజేపీ ఎమ్మెల్యేలను ఇప్పుడు అనుమతిస్తారా లేదా అనేది చూడాలి. ఆర్థిక మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్న సమయంలో బీజేపీ సభ్యులు వెల్‌ వైపు దూసుకురావటంతో సస్పెండ్‌ చేశారు. ఆ ముగ్గురు సభ్యుల్లో ఒకరైన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఒక వర్గాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆయన్ని అరెస్ట్‌ చేసి కారాగారానికి తరలించారు.

Mobikwik: క్లిక్‌ అయిన మొబీక్విక్‌. అద్భుత ఫలితాలను వెల్లడించిన ఫిన్‌టెక్‌ కంపెనీ

ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ను చట్ట సభ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం పార్టీ సభ్యులు ప్రభుత్వాన్ని పట్టుబట్టే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇదే పరిస్థితి తలెత్తితే ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇదిలాఉండగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కారును అసెంబ్లీ వేదికగా నిలదీస్తానని కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క చెబుతున్నారు. మరీముఖ్యంగా గవర్నమెంట్‌ హాస్టళ్లలో ప్రాథమిక సౌకర్యాలు కొరవడటాన్ని పట్టిచూపనున్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీ, గురుకులాలు, ఇతర సంక్షేమ వసతి గృహాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేయనున్నారు.

ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని ఎస్సీ వెల్ఫేర్‌ హాస్టల్‌ను భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి తెలుసుకున్నారు. ఒకే గదిలో 50 మంది విద్యార్థులు ఇరుకిరుకుగా ఉండాల్సి వస్తోందని, భోజనం, చదువు, నిద్ర అన్నీ ఒకే చోట చేయాల్సి వస్తోందని తెలిపారు. 12 రూముల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, వీళ్లందరినీ తక్షణం వేరే పెద్ద భవనంలోకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మొత్తమ్మీద తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ఎప్పటిలాగే హాట్‌ హాట్‌గా జరగనున్నట్లు అర్థమవుతోంది.

Exit mobile version