AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!

  • డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఆధునీకరణ
  • మొదటి దశలో 6 ట్రాక్‌ల ఎంపిక
  • ఏఐ కెమెరాలు, సెన్సార్లతో పరీక్షలు
  • మారుతి సుజుకితో రవాణా శాఖ భాగస్వామ్యం
Ai Track

Ai Track

రోడ్డు ప్రమాదాలను అరికట్టి రహదారి భద్రతను పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. డ్రైవింగ్ పరీక్షలను మరింత కఠినంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను కృత్రిమ మేధ (AI) ఆధారిత వీడియో అనలిటిక్స్ సాంకేతికతతో ఆధునీకరించేందుకు విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్, ఆర్టీఓ రఘునందన్ , హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో కలిసి కొండాపూర్, నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.

మొదటి దశలో 6 ట్రాక్‌ల అప్‌గ్రేడ్.. మారుతి సుజుకి భాగస్వామ్యంతో పనులు

ఇటీవల ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల అధ్యయన కమిటీ సభ్యులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ఆధునిక విధానాలపై సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ (IAS), రవాణా కమిషనర్ ఇలంబరితి (IAS) ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు మొదటి దశ కింద కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని 5 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లతో పాటు కరీంనగర్ ఆర్టీఓ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను ఎంపిక చేశారు. రవాణా శాఖ , ప్రముఖ వాహన సంస్థ ‘మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్’ సంయుక్తంగా ఈ డ్రైవింగ్ ట్రాక్‌లను ఆధునీకరించి, ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ ద్వారా పూర్తి పారదర్శకంగా డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించనున్నాయి.

మానవ జోక్యానికి చెక్.. రహదారి భద్రతకే పెద్దపీట

రహదారి భద్రతను పెంచడంలో నాణ్యమైన డ్రైవింగ్ నైపుణ్యాలే అత్యంత కీలకమని, అందుకే పరీక్షల ప్రక్రియలో మానవ జోక్యాన్ని పూర్తిస్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఉద్ఘాటించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల అర్హత కలిగిన డ్రైవర్లకు మాత్రమే పారదర్శకంగా లైసెన్సులు లభిస్తాయని, ఇది భవిష్యత్తులో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి ఎంతగానో తోడ్పడుతుందని స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత కెమెరాలు, సెన్సార్ల సహాయంతో అభ్యర్థుల డ్రైవింగ్ సామర్థ్యాన్ని ఖచ్చితత్వంతో అంచనా వేసే ఈ విధానంతో రవాణా శాఖలో సరికొత్త మార్పులు రానున్నాయి.