NTV Telugu Site icon

Teenmar Mallana : కేసీఆర్‌ను తిట్టనని మల్లన్న శపథం..

ఎప్పుడూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగే తీన్మార్‌ మల్లన్న ఇక నుంచి తాను సీఎం కేసీఆర్‌ను తిట్టనని శపథం పూనారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిన్న నిర్వహించిన ‘7200 మూవ్‌మెంట్’ సన్నాహక సమావేశానికి తీన్మార్‌ మల్లన్న హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని, అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్‌మెంట్’ ద్వారా పోరాడతానని ప్రకటించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమే తన విధానం కాదని, గొప్పోళ్ల, పేదోళ్ల బిడ్డలు ఒకే పాఠశాలలో చదవాలన్నదే తన ఉద్యమ లక్ష్యమని అన్నారు తీన్మార్‌ మల్లన్న.

విద్యావంతులైన బాల్క సుమన్, గాదరి కిషోర్‌లకు విద్యాశాఖ అప్పగిస్తే బాగుంటుందన్న మల్లన్న.. యాదాద్రిలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలి వానకే తుడిచిపెట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఫామ్‌ హౌస్‌ను విడిచి బయటకు రావడం లేదని మండిపడ్డారు. అలాగే, తమ ఆస్తులను ప్రభుత్వానికి రాసి ఇచ్చేసి జూన్ రెండో వారం నుంచి చేపట్టనున్న ప్రజాపాదయాత్రలో పాల్గొంటామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.