ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ థీమ్ ఒక్కటే.. దేశ సంపదను దోచుకోవడం అంటూ ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా 12 లక్షల కోట్లను లూటీ చేశారని, రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అంటూ మండిపడ్డారు. దేశ సంపదను దోచిన పార్టీ ఇంకా ఖతమవ్వలేదు.. ఆ పార్టీ ఇంకా కొనసాగుతోందని, రైతుల కష్టాలపై ఎలాంటి చింత లేదు.. డ్రామాలు తప్పా ఏమీ లేవు అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ దేశానికి ఉపయోగపడే ట్వీట్లు కాకుండా విదేశీయులకు ఉపయోగపడే ట్వీట్లు చేస్తాడని, రాహుల్ ఇతర దేశాలు ఏవిధంగా పర్యటించారో.. తెలంగాణలోనూ అదే విధంగా పర్యటించారని ఆయన విమర్శించారు.
తెలంగాణలో రాహుల్ పర్యాటనకు పెద్దగా ప్రాధాన్యత లేదని, మోడీ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడని, దేశంలోని ముస్లింలు, జైన్లు, హిందువులు, బుద్ధులు, సిక్కులు ప్రతి ఒక్కరూ మోడీకి అండగా ఉన్నారన్నారు. అసదుద్దీన్ ఒవైసీ జిన్నా అవ్వాలని పరితపిస్తున్నాడని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడని, కేసీఆర్, టీఆర్ఎస్ కి బీ టీమ్ గా ఓవైసీ పనిచేస్తున్నాడన్నారు. హైదరాబాద్ లో ముస్లింల చేతిలో ప్రాణాలు కోల్పోయిన దళిత కుటుంబానికి చెందిన వ్యక్తికి న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామంటే ఓవైసీ ఎందుకు భయపడుతున్నారని, ఎవరిని కాపాడటం కోసం ఇలా చేస్తున్నారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.
