Site icon NTV Telugu

Ganesh Chaturthi Celebrated in Telangana: భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు.. పాల్గొన్న అధికారులు

Khairatabad Vinayakudu

Khairatabad Vinayakudu

హైదరాబాద్‌ లోని ఖైరతాబాద్‌లో పంచముఖ మహాలక్ష్మి గణపతి కొలువుదీరాడు. గణపతి ప్రతిష్టాపన పూజ ఉదయం 5గంటల నుంచి ప్రారంభమయ్యింది. ఉదయం 6గంటలకు పద్మశాలి సంఘం ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఆధ్వర్యంలో 60 అడుగుల గాయత్రి, నూలు కండువా, గరికమాలతో రాజ్‌దూత్‌ చౌరస్తా మీదుగా గుర్రపుబగ్గీలో తెలంగాణ సంస్కృతి కళారూపాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. వినాయక ఊరేగింపులో ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ అధికారి కైరంకొండ సంతోష్‌ నేత ప్రారంభించి, ఉదయం 7గంటలకు స్వామి వారికి జంజంను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారధి, నూలు కండువాను రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి టి. చిరంజీవులు, గరికమాలను గవర్నర్‌ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్‌ సమర్పించనున్నారు. ఉదయం 10.15గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ దర్శించుకున్నారు.

అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తోలిపూజ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ గణేష ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలిపారు. రెండేళ్లు కరోనా కారణంగా చాలా మందికి ఇక్కడికి రాలేకపోయారని, ఇప్పుడు అందరూ దర్శనం చేసుకునే అవకాశం ఉందని గవర్నర్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండేలా ఆ విగ్నేశ్వరుడు చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.

తలసాని శ్రీనవాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలను ఘనంగా చేయమని ఆదేశాలు ఇచ్చారు. బోనాలు , బతుకమ్మ , గణేష్ ఉత్సవాలు ఇలా అన్ని పండుగలను ఎంతో గొప్పగా చేస్తున్నామన్నారు. అన్ని పండుగలకు నిధులు మంజూరు చేసి వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ను మట్టితో తయ్యారు చేసి అందరికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తు్న్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని తలసాని తెలిపారు.

హర్యానా గవర్నర్ దత్తాత్రేయ భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మనం ఏ పని తలపెట్టినా విఘ్నాలు లేకుండా చూడాలని ఖైరతాబాద్ మహా గణపతిని ప్రార్థించానని అన్నారు. తెలంగాణలో బాగా వర్షాలు కురిసి అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకున్నాని తెలిపారు. తెలంగాణలో మత సామరస్యం వెల్లివిరియాలని, ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అన్నారు.
Ganesh Chaturthi Celebrated in Telangana: భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు.. పాల్గొన్న అధికారులు

Exit mobile version