NTV Telugu Site icon

Telangana New Secretariat inauguration: తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం.. హాజరుకానున్న 2 రాష్ట్రాల సీఎంలు

Kcr

Kcr

Telangana New Secretariat inauguration: తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త సచివాలయం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.. నూతనంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు.. వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17వ తేదీన శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాని రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకాబోతున్నారు..

Read Also: MP Avinash Reddy: సీబీఐ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎంపీ అవినాష్‌రెడ్డి.. నిన్న ఇచ్చి ఇవాళ రమ్మంటే ఎలా..?

సచివాలయ ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్ తదితర ముఖ్యులు పాల్గొనబోతున్నారు.. ఇక, సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత.. మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సచివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనే సీఎంలు, ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

కాగా, తెలంగాణ కొత్త స‌చివాల‌యం నిర్మాణం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. కాగా సెక్రటేరియల్ లో పని చేసే వేలాది మంది ఉద్యోగుల అవసరాలు, ప్రాంగణంలో చెట్లు, పచ్చిక నీటి అవసరాల కోసం భవనం కింద రెండున్నర లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో స్టోరేజీ ట్యాంక్ సిద్ధం చేశారు. ఇది దాదాపు ఓ మినీ రిజర్వాయర్ లా ఉంటుంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉండనుంది. వాన నీటిని ఒడిసి పట్టేలా దీన్ని నిర్మించారు. సచివాలయం భవనం నలువైపుల నుంచి వాన నీరు ఇందులోకి వచ్చేలా ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇక, గ్రౌండ్‌ ప్లస్‌ సిక్స్‌ ఫ్లోర్లతో కూడిన ఈ భవనం అద్భుతమైన కట్టడంగా కనువిందు చేస్తోంది. ఈ భవనంలోని ఆరో అంతస్తులో సీఎం ఆఫీసు ఉంటుంది. తూర్పు ముఖంగా ఉన్న భవనంలో నైరుతి మూలన సీఎం ఛాంబర్‌ ఉంటుంది. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా దాదాపు 100 ఏళ్లు మనగలిగేలా ఈ సెక్రటేరియట్‌ భవనాన్ని నిర్మించారు. తెలంగాణ సెక్రటేరియట్‌ మొత్తం విస్తీర్ణం 28 ఎకరాలు. ఇందులో 10, 51,676 చదరపు అడుగుల్లో భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఎత్తు 265 అడుగులు. దేశంలోనే అతి ఎత్తైన భవనాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది.. ఈ భవనంపై ఏర్పాటు చేస్తున్న జాతీయ చిహ్నాన్ని కూడా కలిపితే మొత్తం ఎత్తు 278 అడుగులవుతుంది. 11 అంతస్తుల ఎత్తులో ఈ భవనం కనిపిస్తుంది.. కానీ, ఇందులో ఉన్నవి ఆరు అంతస్తులు మాత్రమే. డెక్కన్‌, కాకతీయ శైలిలో నిర్మించిన ఈ భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణ. తెలంగాణ సంప్రదాయంతో పాటు ఆధునిక హంగులతో దీన్ని నిర్మించారు. భారీ విస్తీర్ణంతో నిర్మించినప్పట్టికీ అతి తక్కువ సమయంలోనే ఈ భవనాన్ని పూర్తి చేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి జూన్‌ 27, 2019న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. జూలై 2020లో పాత భవనాల కూల్చివేత మొదలైంది. శిధిలాల తొలగింపు పనులకే నాలుగు నెలలు పట్టింది. ఏకంగా 14వేల టక్కుల లోడ్ల శిధిలాలు తొలగించారు. జనవరి 4, 2021న నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అంటే కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇంత భారీ భవన నిర్మాణం పూర్తి చేస్తున్నారు.