Site icon NTV Telugu

ఆన్‌లైన్‌ ఆహార ప్రియులకు అలెర్ట్‌.. స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ సమ్మె..!

మెచ్చిన ఫుడ్‌.. నచ్చిన చోటుకు తెప్పించుకోవడానికి ఇప్పుడు ఆహార ప్రియులు మొత్తం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలవరీ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు.. తమ పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నేరుగా ఆఫీసుకి, ఇంటికి.. ఎక్కడుంటే అక్కడికి మెచ్చిన ఆహారం పార్సిల్‌ రూపంలో వచ్చేస్తోంది. ఇక, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలో కీలక భూమిక పోషిస్తోంది.. అయితే, ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ గ్రేటర్‌ హైదరాబాద్‌ విభాగంలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్‌ సమ్మెకు రెడీ అవుతున్నారు. కనీస చార్జీలు, ఇతరత్రా ప్రోత్సాహకాలను డిమాండ్‌ చేస్తూ.. ఇప్పటికే యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇచ్చిన బాయ్స్‌.. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి సరైనరీతిలో స్పందన రాకపోతే.. డిసెంబర్‌ 5వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు వెల్లడించారు.

Read Also: రాజధాని రైతులకు వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం.. ఇబ్బంది ఉంటే ఫోన్‌ చేయండి..!

దీనిపై తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ ఫార్మ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. స్విగ్గీ సీఈవో శ్రీహర్ష మజేటీ, హైదరాబాద్‌ మేనేజర్‌కు ఈ మేరకు లేఖలు రాశామని.. స్విగ్గీ బాయ్స్‌కు కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదన్న ఆయన.. పెట్రోల్‌ ధరలు పెరిగినా.. వారికి చెల్లించాల్సిన చార్జీల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీకి సబంధించి కేవలం హోటల్‌ నుంచి కస్టమర్‌ చిరునామాకు కిలోమీటర్ల లెక్కతో చార్జీలు ఇస్తున్నారి.. అపార్ట్‌మెంట్లలో మెట్లెక్కి దిగడం వంటి పనులకు రుసుం చెల్లించడం లేదన్నారు.. కస్టమర్‌ దగ్గర నుంచి తిరిగి హోటల్‌కు రావడానికి అయ్యే ఖర్చునూ జమ కట్టడం లేదని మండిపడ్డారు.. ఇవాళ్టి నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 10 వేల మంది డెలివరీ బాయ్స్‌ సమ్మెలో పాల్గొంటారని వెల్లడించారు. ఆన్‌లైన్‌ ఆహార ప్రియులు ఇది గమనించగలరు.

Exit mobile version