SWAN Green Carnival : హైదరాబాద్ నగరం మరోసారి పర్యావరణ పరిరక్షణకు తన నిబద్ధతను చాటుకుంది. జూన్ 14న ఫౌంటన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ ప్రాంగణంలో సేవ్ వాటర్ అండ్ నేచర్ (SWAN) అనే ప్రముఖ ఎన్జీఓ ఆధ్వర్యంలో “గ్రీన్ కార్నివాల్” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి SWAN అధ్యక్షురాలు, చైర్‌పర్సన్ శ్రీమతి మేఘన ముసునూరి నేతృత్వం వహించారు. కార్నివాల్‌కు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు హాజరై పర్యావరణ పరిరక్షణకు తమ పూర్తి మద్దతు తెలిపారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో కీలకంగా సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు “గ్రీన్ ఫ్రంటియర్ అవార్డ్స్” అందించారు. ముఖ్యంగా ఇషా ఫౌండేషన్, వాటా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ కృష్ణ పెద్దిరెడ్డి ఈ అవార్డు గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా మీదికుంట చెరువు వరకు నిర్వహించిన పాదయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, పౌరులు పాల్గొన్నారు. పాదయాత్రతో ప్రజల్లో ప్రకృతిపట్ల అవగాహన పెరిగేలా చేశారు. కార్నివాల్ ప్రాంగణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే కాకుండా, అక్కడ ఏర్పాటు చేసిన గ్రీన్ స్టాళ్లు, సేంద్రియ ఆహార కౌంటర్లు, పర్యావరణ ఇతివృత్తంతో సాగిన గేమ్స్, కళా ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఫౌంటన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపాల్ కొయ్య సుధారాణి మాట్లాడుతూ, “SWAN సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణం పట్ల చైతన్యం కలిగించడంలో గొప్ప శుభారంభం. భవిష్యత్తులో మేమూ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతాం” అని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో వినియోగపు అలవాట్లను మార్చే దిశగా ప్రభావాన్ని చూపుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, సేంద్రియ జీవనశైలి, పునర్వినియోగంపై మక్కువ కలిగించేలా ఈ కార్నివాల్‌ను రూపొందించారని తెలిపారు.
SWAN సంస్థ విద్య, భాగస్వామ్యం, సామాజిక చైతన్యం అనే మూడు స్తంభాలపై పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోంది. హైదరాబాద్‌లోని ఈ తొలి గ్రీన్ కార్నివాల్ విజయవంతంగా పూర్తవడం ద్వారా మరిన్ని నగరాల్లో, పాఠశాలల్లో కూడా ఈ తరహా కార్యక్రమాలను విస్తరించాలనే లక్ష్యాన్ని SWAN ప్రకటించింది. “సుస్థిర జీవనశైలి మన భవిష్యత్తుకు మార్గదర్శకం, అది ఒక ట్రెండ్ కాదు.” అని ఈ వేడుక ద్వారా ఒక స్పష్టమైన సందేశం వెలువడింది
అవార్డులు అందుకున్నవారు:
– ఇషా ఫౌండేషన్,వాటా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ ఉదయ్ కృష్ణ పెద్దిరెడ్డి
– శ్రీ అక్షయ్ దేశ్‌పాండే (స్విచ్‌ఇకో)
– శ్రీ అవినాష్ (ఫర్ అవర్ సొసైటీ – FOS)
– శ్రీ అనుజ్ జైన్ (ఏజే డిజైన్)
– శ్రీ అభిషేక్ అగర్వాల్ (గూడీబ్యాగ్)
– శ్రీ శరత్ చంద్ర (సిరి ఫౌండేషన్ & రీసైకల్)
– శ్రీమతి మధులత (సామాజిక కార్యకర్త)
– శ్రీ అరవింద్ (యూత్ ఫర్ సేవ – YFS)
– గనేసుని ఆశృత (విద్యార్థిని, 8వ తరగతి)
– దైవిన్ రెడ్డి (విద్యార్థి, 3వ తరగతి)