Supervisory Committee Meeting At Uppal Cricket Stadium: ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ విధివిధానాలపై పర్యవేక్షక (సూపర్‌వైజరీ) కమిటీ సోమవారం సమావేశం నిర్హించింది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు జస్టిస్ & కమిటీ చైర్మన్ నిసార్ అహ్మద్ కక్రు, ఏసీబీ డీజీ అంజనీ కుమార్, మాజీ భారత క్రికెటర్ వెంకటపతి రాజు, కమిటీ సూపర్ వైజర్ నెంబర్ వంక ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా పలువురు సభ్యులు, మాజీలు.. సూపర్‌వైజరీ కమిటీకి కొన్ని రికార్డ్స్, డాక్యుమెంట్స్ సమర్పించారు.
ఈ సమావేశం అనంతరం సుప్రీంకోర్టు జస్టిస్ & ఛైర్మన్ కక్రు మాట్లాడుతూ.. సోమవారం ఉప్పల్ స్టేడియంలో పర్యవేక్షణ కమిటీ సమావేశం అయ్యిందన్నారు. కొన్ని రోజులుగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌పై నలుగురు సభ్యుల గల సూపర్‌వైజరీ కమిటీ దృషి కేంద్రీకరించిందన్నారు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ విజయవంతం కావడం కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణమన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ తమ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతం అయ్యిందన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల అడ్వైజరీ కమిటీ కొన్ని విషయాలపై రివ్యూ చేయడంతో పాటు రికార్డులు, డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ రివ్యూలో భాగంగా చాలా రిప్రెజెంటేషన్స్ స్వీకరించడం జరిగిందన్నారు. అక్టోబర్ 3 వరకు వాటిపై విచారణ చేసి, తమ నిర్ణయాల్ని తెలియజేస్తామన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీ మాట్లాడుతూ.. పర్యవేక్షణ కమిటీకి కొందరు సభ్యులు రిప్రెసెంటేషన్ ఇచ్చారని, డాక్యుమెంట్స్ సమర్పించారని, వాటిని వెరిఫికేషన్ చేశామని తెలిపారు. పర్యవేక్షణ కమిటీ అన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందన్నారు. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఘనంగా జరగడం దేశానికే గర్వకారణమన్నారు.