Site icon NTV Telugu

HYDRA : సున్నం చెరువు పునరుద్ధరణపై హైడ్రా కీలక సమావేశం

Hydra

Hydra

HYDRA : హైదరాబాద్‌లోని సున్నం చెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్న హైడ్రా అధికారులు శనివారం స్థానికులతో కీలక సమావేశం నిర్వహించారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఆంజనేయస్వామి గుడి, ముస్లింల ప్రార్థనా స్థలం ‘చిల్లా’ మార్పు గురించి ఇరుపక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటూ హైడ్రా కమిషనర్ స్వయంగా నివాసితులతో మాట్లాడారు. చెరువు పునరుజ్జీవనంలో భాగంగా ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాలను గట్టు వైపు మార్చాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించగా, రెండు వర్గాల స్థానికులూ ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపారు.

సున్నం చెరువు కూడా హైడ్రా చేపట్టిన ప్రధాన పునరుద్ధరణ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉన్నందున, చెరువు అసలు పరిమితిని కాపాడటం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, ఆక్రమణలను తొలగించడం వంటి కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియలో ఆంజనేయుని గుడి, చిల్లా ఎఫ్‌టీఎల్‌లోకి వస్తుండటంతో, వాటి పునర్‌వ్యవస్థీకరణపై గత కొంతకాలంగా సమీక్ష జరుగుతోంది.

ఈరోజు జరిగిన ఈ సమాలోచనలో ఇరువర్గాల నివాసితులు పూర్తిగా సహకరిస్తామని హైడ్రాకు హామీ ఇవ్వడం ద్వారా పెండింగ్‌లో ఉన్న సమస్యకు తెరపడింది. పునరుద్ధరణ పనుల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ముందుకు సాగేందుకు ఈ అంగీకారం ఎంతో సహాయకారి అవుతుందని హైడ్రా అధికారులు తెలిపారు. చెరువు భద్రత, అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యల్లో ప్రజల సహకారం అత్యంత కీలకమని కమిషనర్ సమావేశంలో పేర్కొన్నారు.

Tufail Ahmad Arrest: ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరు అరెస్ట్.. SIA అదుపులో ఎలక్ట్రీషియన్‌

Exit mobile version