Site icon NTV Telugu

Srushti Testtube Baby Centre: సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ కేసులో తెరపైకి సంచలన విషయాలు..

Srushti Test Tube Baby Cent

Srushti Test Tube Baby Cent

Srushti Testtube Baby Centre: సికింద్రబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. చట్టవ్యతిరేక సరోగసి విధానాలు, పిల్లల అక్రమ విక్రయం వంటి అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో డాక్టర్ నమ్రత ప్రధాన పాత్రధారిగా మారగా, ఆమె ఆధ్వర్యంలో సరోగసి కోసం వచ్చిన దంపతులకు వేరే పిల్లలను ఇవ్వడానికి ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత గోపాలపురంలోని ఓ జంట చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సృష్టి సెంటర్‌పై దాడులు చేశారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ, “సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై మేము ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించాం. చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో ఈ కేసును పరిశీలిస్తున్నాం” అని తెలిపారు. నమ్రత వద్ద సరోగసి కోసం వచ్చిన అనేక దంపతుల డేటా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

గోపాలపురానికి చెందిన ఒక జంట ఆన్లైన్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ గురించి తెలుసుకుని, సరోగసి కోసం డాక్టర్ నమ్రతను సంప్రదించింది. ఆమె సరోగసి ద్వారా పిల్లవాడిని పొందడానికి రూ.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పిందట. జంట సూచించిన ప్రకారం నమ్రత ఇచ్చిన దిశానిర్దేశాలతో వారు విజయవాడకు వెళ్లి శ్యాంపిల్స్ అందజేశారు. ఆ తర్వాత ఒక అద్దె గర్భిణి (సరోగేట్ మదర్) లభించిందని నమ్రత వారికి చెప్పింది.

కొన్ని నెలల తర్వాత బాబు పుట్టాడని నమ్రత జంటకు తెలియజేసింది. సిజేరియన్ ద్వారా డెలివరీ అయ్యిందని చెప్పి, అదనంగా మరో రూ.10 లక్షలు కూడా తీసుకుంది. డబ్బులు చెల్లించిన తర్వాత కొంతకాలం బిడ్డను చూసుకుంటున్న జంటకు, బాబు పోలికలు తమతో సరిపోకపోవడంతో అనుమానం వచ్చింది. DNA టెస్టు చేయాలని వారు కోరినప్పటికీ, నమ్రత నిరాకరించింది. చివరికి జంట ఢిల్లీలో స్వయంగా DNA పరీక్ష చేయించగా, బాబు మరొకరి సంతానంగా తేలింది.

ఈ ఘటన బయటపడిన తర్వాత పోలీసులు డాక్టర్ నమ్రతపై దర్యాప్తును మరింత కఠినతరం చేశారు. ఆమెను రిమాండ్ అనంతరం కస్టడీలోకి తీసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నమ్రత విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

“ఈ కేసులో పిల్లల అక్రమ విక్రయం జరుగుతోందా అనే అంశంపై స్పష్టత తీసుకువచ్చేలా అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. ఇప్పటికే DNA టెస్టులు మరియు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను పరిశీలిస్తున్నాం,” అని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version