Site icon NTV Telugu

Srushti Test Tube Baby Centre: పిల్లలు కావాలని వెళ్తే వేరే వ్యక్తి వీర్యంతో గర్భం.. షాకింగ్ ఘటన వెలుగులోకి!

Be Alert

Be Alert

మెడికల్ మాఫియాకు హద్దులు లేకుండా పోతున్నాయి. వైద్యులు దేవునితో సమానం అని జనం నమ్మి వస్తే.. తాము ఏం చేసినా చెల్లుతుందనే రీతిలో మెడికల్ మాయగాళ్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఓ టెస్ట్ ట్యూబ్ సెంటర్ చేసిన నిర్వాకం.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వారు చేసే బాగోతాన్ని బయటపెట్టింది. అసలు ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఏం జరిగింది? పోలీసుల సోదాల్లో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి?

పిల్లలు లేని దంపతుల బాధ వర్ణనాతీతం.. పిల్లలు పుట్టడం కోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదంటే ఆశ్చర్యం కాదు. కనిపించిన ఆస్పత్రికల్లా వెళ్తూనే ఉంటారు. పూజలు, వ్రతాలు, నోములు చేస్తారు. కానీ పిల్లలు కావాలనే వారి సెంటిమెంట్‌ను మాత్రం మెడికల్ మాఫియా క్యాష్ చేసుకుంటోంది. పైగా వారి సెంటిమెంట్‌తో చెలగాటం ఆడుతోంది. సరిగ్గా ఇలాంటి ఘటనే సికింద్రాబాద్‌లో జరిగింది. సృష్టికి ప్రతి సృష్టికి చేస్తారని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు ఆ దంపతులు. వారిని నిలువునా మోసం చేసింది సృష్టి అనే టెస్ట్ ట్యూబ్ సెంటర్.

తన భర్త వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని ఓ మహిళ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లోనే వైద్యురాలిని కోరింది. ఆ తర్వాత వైద్యులు చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అయింది. సరిగ్గా 9 నెలలకు ఆ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అంతా బాగుంది.. ఆ దేవుడు తమను కరుణించాడు అనుకునే టైమ్‌‌లో ఆ దంపతులకు షాక్ తగిలింది. పుట్టిన బిడ్డకు కేన్సర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆ దంపతులు.. ముందు తమ అదృష్టం బాగాలేదని బాధపడ్డారు. పిల్లలు కావాలనుకుని ఇంతా కష్టపడితే మరోలా జరిగిందని కుంగిపోయారు. అసలు తన భర్తకు లేని కేన్సర్‌ పుట్టిన బిడ్డకు ఎలా వచ్చిందనే మహిళ అనుమానం కారణంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బాగోతం బయటపడింది.

కేన్సర్ ఎలా వచ్చిందనే అనుమానంతో టెస్ట్ ట్యూబ్ ద్వారా పుట్టిన శిశువుకు DNA టెస్ట్ చేయించారు. ఈ టెస్టులో వచ్చిన ఫలితాలు వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. తన భర్త DNAతో శిశువు DNA రిపోర్టు సరిపోలలేదు. అంటే వేరే వ్యక్తి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించినట్లు తేలింది. దీంతో ఆ దంపతులు.. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ తమను మోసం చేసినట్లుగా గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దంపతుల ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. అంతే కాదు ఆ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. సెంటర్ నడిపిస్తున్న వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు.

అలాగే సికింద్రాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు బ్రాంచీలు ఉన్నాయి. వాటిలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. సరోగసి చేసేందుకు పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. అంతే కాదు వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు పోలీసుల సోదాల్లో బయట పడింది. మొత్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయంటున్నారు పోలీసులు. మొత్తంగా ఫర్టిలిటీ క్లినిక్‌ల ముసుగులో కొంత మంది వైద్యులు.. మెడికల్ మాఫియాలా తయారై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. జనాల సెంటిమెంట్‌తో ఆటలాడుకుంటున్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. ఫర్టిలిటీ క్లినిక్‌ల నైతిక ప్రమాణాలు, పారదర్శకత ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.

Exit mobile version