DCP Rashmi Perumal : సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ క్లినిక్‌పై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతో అక్రమ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని పోలీసులు స్పష్టంచేశారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి.
సృష్టి క్లినిక్‌లో సరోగసి పద్ధతిలో బిడ్డను కల్పిస్తామని చెబుతూ, వాస్తవానికి వేరే మహిళకు పుట్టిన బిడ్డను ఇవ్వడం ద్వారా దంపతులను మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఒక గర్భిణి మహిళను ఫ్లైట్‌లో విశాఖపట్నానికి తీసుకొచ్చి, అక్కడ డెలివరీ చేయించారని రష్మి పెరుమాళ్ తెలిపారు. పుట్టిన బిడ్డను ఆంధ్రప్రదేశ్‌లోని ఒక దంపతులకు సరోగసి బిడ్డ అని నమ్మించారు.
సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత దంపతుల వద్ద నుండి రూ.40 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో బిడ్డను ప్రసవించిన ఢిల్లీ మహిళకు రూ.90,000 ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తం లావాదేవీలన్నీ సరోగసి సేవల పేరిట మోసపూరితంగా నిర్వహించినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
డీసీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ.. సరోగసి పేరుతో మోసం మాత్రమే కాకుండా, చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతోందన్నారు. బిడ్డను ఇతర మహిళ నుంచి తెచ్చి సరోగసి బిడ్డ అని చెప్పి దంపతులను మోసం చేశారన్నారు. నమ్రతపై ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు నమోదయ్యాయని ఆమె వెల్లడించారు. IVF విఫలతలు, సరోగసి అక్రమాలు ఈ కేసుల్లో ప్రధానంగా ఉన్న అంశాలు అని డీసీపీ రష్మి పెరుమాళ్ పేర్కొన్నారు.
నమ్రతపై బాధితులు ఫిర్యాదులు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా బయటపడ్డాయి. తన కొడుకు జయంత్ అడ్వకేట్ కావడం వలన, కోర్టు కేసుల పేరుతో బాధితులను బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
