Srikanth Arrested For Harassing Naina Jaiswal On Social Media: సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఎంతలా రెచ్చిపోతున్నారో అందరికీ తెలుసు. తమని ఏం చేయలేరన్న ధీమాతో.. అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తూ, యువతుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సెలెబ్రిటీలనే టార్చర్ పెడుతుంటారు. నేరుగా మెసేజ్‌లు చేస్తూ వేధిస్తారు. ఇలాంటి మెసేజ్‌లను సెలెబ్రిటీలు చాలావరకు పట్టించుకోరు. కానీ, హద్దులు దాటి ప్రవర్తిస్తే మాత్రం తమదైన శైలిలో తాటతీస్తారు. ఇప్పుడు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కూడా అదే పని చేసింది. పలుసార్లు హెచ్చరించినా ఓ యువకుడి తీరు మారకపోవడంతో.. పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో అతడిప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలం నుంచి నైనా జైస్వాల్‌ను సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నాడు. తొలుత ఇన్‌స్టాగ్రామ్‌లో వల్గర్ మెసేజ్‌లు పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె అతడ్ని పలుసార్లు హెచ్చరించింది. అయినా వినిపించుకోకుండా విసిగించడంతో.. పోలీసుల్ని ఆశ్రయించింది. అప్పుడతడ్ని సిద్దిపేట్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అప్పటికీ అతనిలో మార్పు రాకపోగా.. ట్విటర్ మాధ్యమంగా మరోసారి నైనాపై వేధింపులకు దిగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన నైనా.. ఈ విషయాన్ని తన తండ్రి అశ్విని జైస్వాల్‌కు తెలియజేసింది. ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి, నిందితుడు శ్రీకాంత్‌ని అరెస్ట్ చేశారు.