NTV Telugu Site icon

హుజూరాబాద్‌లో ముగ్గురూ బీసీలేనా..?

ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా హుజూరాబాద్‌ చుట్టే తిరుగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ విషయంలో పెద్ద సస్పెన్స్‌ ఏమీ లేదు ..కానీ కాంగ్రెస్‌లోనే ఇంకా సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి ఎవరని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఐతే, కొండా సురేఖ పేరు ఖరారు అయిందని గాంధీ భవన్‌ వర్గాలు అంటున్నాయి. హైకమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందటమే ఆలస్యమట.

వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్‌ మూడు పేర్లతో హైకమాండ్‌కు నివేదిక సమర్పించారు. ఆ నేతలు రెడ్డి, దళిత, బీసీ సమాజిక వర్గాలకు చెందిన వారు. ఒక వేళ వ్యూహం మారినా అందుకు తగ్గట్టు అభ్యర్థులు రెడీగా ఉండేలా హైకమాండ్‌కు ముందుగానే మూడు పేర్లు పంపించారని అంటున్నారు. అయితే హుజూరాబాద్‌లో ఇప్పుడు కుల ప్రాతిపదికన ప్రజలు ఓటు వేసే పరిస్థితిలో ఉన్నారా అన్నది ప్రశ్న. ఈ ఎన్నికలో క్యాస్ట్‌ ఈక్వేషన్ పెద్దగా ఉండకపోవచ్చు.. దీనిని ప్రజలు ఓ పొలిటికల్‌ అంశంగానే చూస్తారని విశ్లేషకులు అంటున్నారు. అప్పుడు జనం ఇక్కడ కేసీఆర్‌ కావాలా.. ఈటెల కావాలా అని తేల్చుకుంటారు. పోటీ ఇద్దరి మధ్యే అయినా ఇక్కడ కాంగ్రెస్‌ కు ప్రాధాన్యం ఉంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 60 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ బలహీన అభ్యర్థిని రంగంలోకి దించితే రేపు అనేక విమర్శలకు సమాధానం చెప్పాల్సివుంటుంది. టీఆర్‌ఎస్‌,బీజేపీలకు రేవంత్ రెడ్డి ఆ అవకాశం ఇవ్వాలనుకోవట్లేదు. అందుకే బలమైన కొండా సురేఖను బరిలో దించుతున్నారని అంటున్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వరంగల్‌ ఈస్ట్‌ నియెజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2018లో టీఆర్‌ఎస్‌ని వీడి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. కానీ కాంగ్రెస్‌ టికెట్‌పై సిటింగ్‌ సీట్‌లోనే ఓటమి పాలయ్యారు. పార్టీ ఏదైనా వరంగల్‌ జిల్లాలలో కొండా దంపతులకు స్వతహాగా కొంత బలం ఉంది. పైగా ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. కొండా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బీసీల మధ్య పోరుగా మారే అవకాశం కూడా లేకపోలేదు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ పేరు ఇప్పటికే ప్రకటించారు. బిజెపి తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. కానీ నూటికి 99 శాతం ఈటల రాజేందర్ పోటీ చేస్తారు. ఆయన బీసీ కులాలలో ఒకటైన ముదిరాజ్ వర్గానికి చెందినవారు. చివరి నిమిషంలో మార్పు జరిగినా కూడా ఆయన ప్లేస్‌ లోకి భార్య వస్తుంది. అంతకు మించి పెద్ద మార్పు ఉండదు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో లక్షా ఇరవై వేల మంది బసీ ఓటర్లున్నారు. అందుకే కాంగ్రెస్ కూడా బీసీ అయినా సురేఖకు మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేయటానికి ఆమెకు పెద్దగా ఇష్టం లేకపోయినా పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ ఒప్పంచినట్టు తెలుస్తోంది. సురేఖ పద్మశాలీ కాగా..ఆమె భర్త మురళి మున్నూరు కాపు. ఆయన కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన వారే. దీంతో పద్మశాలి, మున్నూరు కాపు ఓట్లు తమకే దక్కుతాయని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. అలాగే కొండా సురేఖ మహిళ కావటం కూడా కలిసొచ్చే అంశం. హుజురాబాద్ నియోజకవర్గంలో లక్షకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి పి కౌశిక్ రెడ్డి 61,000 ఓట్లు సాధించారు. ఇప్పుడు ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. దాంతో కాంగ్రెస్‌కి అక్కడ బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. అందుకే ఈ పాట్లు పడాల్సి వస్తోంది. హైకమాండ్‌కు పంపిన నివేధికలో కొండా సురేఖతో పాటు పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్‌ పేర్లు కూడా ఉన్నాయి. అయితే మెజార్టీ నేతలు కొండా సురేఖ అభ్యర్థిత్వాన్నే బలపరిచినట్టు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆదివారం నాటికే రిపోర్టు హైకామండ్‌కు అందినట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా ప్రకటన వెలువడవచ్చు. కొండా సురేఖ అభ్యర్థి అయితే హుజూరాబాద్ ప్రజలు అక్కడ ద్విముఖ పోరు కాదు..త్రిముఖ పోరు చూస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు!!