హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు సాయంత్రంతో ప్రచార సమయం ముగియనుంది. దీంతో నాయకులు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఓటర్లను తిప్పుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో ఓటమి ఖాయమని తెలిసి ప్రస్టేషన్‌తో కొంతమంది ఫోన్లు పగలకొడుతున్నారట అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు మాపై ఇచ్చిన ఫిర్యాదులతో మేము ఉన్న ఇండ్లను అధికారులు తనిఖీలు చేశారని ఆయన అన్నారు.
మా ముఖ్యమంత్రి సభ పెట్టకుండా చేసారు. బండి సంజయ్ మాత్రం సభ పెట్టుకున్నారు. రైతు నాగలి గుర్తు నుండి నేటి వరకూ టీఆర్ఎస్ గెలుస్తూనే ఉంది. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ ను ప్రజలు ఆశీర్వదించారు. ఇక్కడ సర్వేలన్నీ మేము గెలుస్తామని తెలిపాయి. టీఆర్ఎస్ ఓటుకు 20 వేలు ఇస్తుందని రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అని ఆయన అన్నారు. బీజేపీ నేతలు అబద్దాలతో ప్రచారం చేశారని, గ్లోబల్ ప్రచారాలకు తెరలేపారని అన్నారు. మహిళా సంఘాలకు చెక్కులిస్తే అవి చెల్లవు అని ప్రచారం చేశారని, కేంద్రంలో ఏడు ఏండ్ల పాలనలో అనేకసార్లు సెస్ పెంచారని, కేంద్ర మంత్రులు సైతం ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రజలకు అబద్దాలు చెప్పారని విమర్శించారు. మేము చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను నమ్ముకున్నామని ఆయన అన్నారు. ఏడేళ్ల టీఆర్‌ఎస్ ఏం చేసిందో.. ఏడేళ్లలో బీజేపీ ఏం చేసిందో చర్చిద్దాం అంటే ముందుకు రాలేదని, సరుకు లేకనే నోరు జారుతున్నారని అన్నారు. అన్నం పెట్టి పెంచిన కేసీఆర్ ను తిట్టడం రాజేందర్ కు తగదని చాలా మంది సామాన్యులు అన్నారని హరీశ్‌రావు అన్నారు. బీజేపీ ఓట్ల కోసం తొండాట ఆడుతుందని ఆయన అన్నారు.