Fire Accident : నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సోమాజిగూడ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఆల్ పైన్ హైట్స్ (Alpine Heights) అపార్ట్‌మెంట్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఆదివారం కావడంతో అపార్ట్‌మెంట్‌లోని నివాసితులంతా ఇళ్లలోనే ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో ఐదో అంతస్తులో ఉన్న వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. పొగ దట్టంగా వ్యాపించడంతో అపార్ట్‌మెంట్‌లోని ఇతర అంతస్తుల నివాసితులు కూడా వెంటనే భవనం వెలుపలికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. అదృష్టవశాత్తూ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో అవి ఇతర ఇళ్లకు వ్యాపించకుండా ఆగిపోయాయి.
ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆ ప్లాట్‌లోని ఫర్నిచర్ , ఇతర వస్తువులు కాలిపోయి భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అపార్ట్‌మెంట్లలో సరైన అగ్నిమాపక భద్రతా చర్యలు ఉన్నాయా లేదా అనే కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
Sheraj Mehdi: అమ్మాయిలు ఎలా ఉండాలో చెప్పడానికి ‘ఓ అందాల రాక్షసి’: షెరాజ్ మెహదీ
