Site icon NTV Telugu

MLAs poaching case: తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త టెన్షన్‌.. కీలక నేతలకు నోటీసులు సిద్ధం చేసిన సిట్‌..

Mlas Poaching Case

Mlas Poaching Case

సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్‌కు సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించింది ప్రత్యేక దర్యాప్తు బృందం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డిలను ప్రలోభ పెట్టి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఈ కేసులో లింక్‌లు ఒక్కొక్కటిగా బయట పడుతున్నట్టు తెలుస్తోంది.. ఇవాళ 8 గంటల పాటు అడ్వకేగట్‌ శ్రీనివాస్‌ను ప్రశ్నించిన సిట్.. రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.. మరోవైపు.. శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్న కొందరు నేతలకు సిట్‌ నోటీసులు సిద్ధం చేస్తోందట.. దీంతో, తెలంగాణ బీజేపీ నేతల్లో టెన్షన్‌ మొదలైందట..

Read Also: Rasna Founder passed away: ‘రస్నా’ వ్యవస్థాపక చైర్మన్ ఇక లేరు..

నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్, ఎస్‌హెచ్‌వో మోహినాబాద్ ఆధ్వర్యంలో ఇవాళ శ్రీనివాస్‌ను విచారించింది సిట్‌ టీమ్.. ముఖ్యంగా సింహయజీ స్వామికి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలుపై శ్రీనివాస్‌ను ప్రశ్నించింది సిట్.. అక్టోబర్ 26 తిరుపతి నుండి హైదరాబాద్ కు సింహయజీ స్వామికి టికెట్స్ ఎందుకు బుక్ చేసారని ఆరా తీశారు.. ఇక, శ్రీనివాస్ కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్‌లను ముందు ఉంచి ప్రశ్నించింది సిట్‌.. అసలు, ఎవరు చెబితే ఫ్లైట్ టికెట్స్ కొనుగోలు చేశారనే సమాచారాన్ని సేకరించారు.. అయితే, సింహయజీ స్వామితో పూజ చేయించడానికి మాత్రమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశామని శ్రీనివాస్‌ సిట్‌కు తెలిపారట.. సింహయాజీతో హోమం, మరికొన్ని పూజలు జరిపించాలని అనుకున్నాను.. అందుకే టికిట్స్‌ బుక్‌ చేసినట్టు వివరణ ఇచ్చారని సమాచారం.

దర్యాప్తు కోసం సిట్‌ సేకరించిన కాల్ డేటా, వాట్సాప్‌ మెసేజ్‌ల ఆధారంగా తెలంగాణ బీజేపీలోని కీలక నేతలకు ఏ క్షణంలోనైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. మరోవైపు.. ఈరోజు విచారణకు హాజరు కాలేదు బీజేపీ నేత బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి.. వారిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు సిట్ అధికారులు… విచారణకు రానివారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో సమాలోచనలు చేసి.. చర్యలకు సిద్ధమవుతోంది.. రేపు ఈ వ్యవహారంలో హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాతే చర్యలకు సిద్ధం అవుతోందట సిట్‌ టీమ్.. మరి.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌కి నోటీసులు జారీ చేసిన సిట్‌.. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్‌ చేస్తామని పేర్కొన్న విషయం విదితమే. దీంతో, విచారణకు హాజరుకానివారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇంకా ఎవరెవరికి నోటీసులు జారీ చేస్తారు? అనేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version