Site icon NTV Telugu

Online Betting: కొడుకును కాపాడుకునేందుకు బంగారం అమ్మిన తల్లి..!

Online Betting

Online Betting

Online Betting: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్‌ పెద్దూరు గ్రామంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ గ్రామానికి చెందిన ప్రణయ్‌ అనే యువకుడిని బెట్టింగ్‌ ముఠా ఉచ్చులోకి లాగి భారీ మొత్తంలో వసూళ్లు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రణయ్‌ గత కొంతకాలంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నాడని, దీనిని ఆసరాగా తీసుకున్న బెట్టింగ్‌ ముఠా సభ్యులు అతడిపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి దాదాపు రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.

ముఠా బెదిరింపులకు భయపడి ప్రణయ్‌ రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొడుకును కాపాడుకునేందుకు ఇంట్లో ఉన్న బంగారం అమ్మి, అప్పులు చేసి కూడా ముఠాకు డబ్బులు అందజేసినట్లు యువకుడి తల్లి తెలిపింది. అయితే డబ్బులు ఇచ్చినా వేధింపులు ఆగకపోవడంతో కుటుంబం తీవ్ర నిరాశకు గురై ఉమ్మడి ఆత్మహత్యకు నిర్ణయించుకున్నదని తెలుస్తోంది.

ఇక, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొడుకును దక్కనీయమని బెట్టింగ్‌ ముఠా సభ్యులు హెచ్చరించడంతో భయంతో కుటుంబం పోలీసుల వద్దకు వెళ్లలేకపోయింది. పలుమార్లు ప్రణయ్‌ను బంధించి డబ్బులు వసూలు చేసినట్లు కూడా బాధితులు వెల్లడించారు. చివరకు ప్రాణభయంతో ఉన్న ప్రణయ్‌ కుటుంబం ఇప్పుడు పోలీసుల వద్దకు విజ్ఞప్తి చేస్తూ, తాము ఎదుర్కొంటున్న బెట్టింగ్‌ ముఠా వేధింపుల నుంచి కాపాడాలని వేడుకుంటోంది.

PM Modi: పాకిస్తాన్‌లో పేలుళ్లతో కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర కరువు..

Exit mobile version