Siddipet Car Accident: సిద్దిపేట జిల్లాలో జరిగిన కారు ప్రమాదం విషాదం మిగిల్చింది. కొండపాక మండలం జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. బావిలో పడ్డ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మరొకరు కారులోనే ఇరుక్కుపోయి చనిపోయారు. బావిలో పడ్డ కారు, యాదగిరి కోసం ఆరుగంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సిద్దిపేట జిల్లా సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి తన బావలను ఇంటికి తీసుకురావడానికి కారు తీసుకుని కొండపాకకి బయలుదేరాడు. అక్కడ తన బావలు కనకయ్య, యాదగిరిలను కారులో ఎక్కించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా కారు అదుపు తప్పింది. ఈ సమయంలో కారు అతివేగంతో ఉండటంతో రోడ్డు పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి కారు దూసుకెళ్లింది. వెంటనే గమనించిన స్థానికులు వెంకటస్వామి, కనకయ్యలను బయటికి తీసి ప్రాణాలు కాపాడారు. వీరిద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో చిక్కుకున్న సూరంపల్లికి చెందిన యాదగిరి కారుతో పాటు బావిలో పడి మృతిచెందాడు.
కారు, యాదగిరి ఆచూకి కనుగొనెందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బావి చుట్టు చెట్లు ఉండటం. ముళ్ల పొదలంతా బావిని కప్పేయడంతో సహాయక చర్యలు చేపట్టడానికి కాస్త ఆలస్యమైంది. చెట్లను తీసేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. మరోవైపు బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో కూడా రెస్క్యూ ఆపరేషన్ ని ఆటంకంగా మారింది. బావి చుట్టూ లైట్లు వేసి క్రేన్‌ని తెప్పించారు పోలీసులు. అయితే క్రేన్ తాడు సరిపోకపోవడంతో సిద్దిపేట నుంచి మరో భారీ క్రేన్‌ను తెప్పించి కారును బయటికి తీశారు పోలీసులు.యాదగిరి మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్న బంధువులు. మొత్తానికి సిద్దిపేటలో జరిగిన కారు ప్రమాదం ఇరుకుటుంబాల్లో విషాదం మిగిల్చింది. దాదాపు ఆరుగంటల పాటు కష్టపడి కారుని, యాదగిరి మృతదేహన్ని బయటకు తీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Siddipet Car Accident: కారు ప్రమాదంలో విషాదం.. ఆరు గంటలు శ్రమించి యాదగిరి మృతదేహం బయటకు