Shubhakshetra Fraud: శుభాక్షేత్ర పేరుతో అధిక లాభాల పేరుతో పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న బండి శివకుమార్‌ను నాగోల్‌లో అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. శుభాక్షేత్ర మైక్రో ఫైనాన్స్ కేసు నమోదైనప్పటి నుంచి బండి శివకుమార్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చేపట్టిన EOW పోలీసులు నాగోల్‌లో అతడిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.
ఇప్పటికే ఇద్దరు నిందితులు అరెస్ట్
ఈ కేసులో ఇప్పటికే శుభాక్షేత్రకు చెందిన రమాకాంత్ రెడ్డి, రమావత్ మధు అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా బండి శివకుమార్ అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. శుభాక్షేత్ర డైరెక్టర్లు పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పటాన్‌చెరువుకు చెందిన సుమారు 40 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు EOW పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంకా ఇతర నిందితుల పాత్ర, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

