పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట ప్రముఖల దగ్గర కోట్ల రూపాయలు కొట్టేసిన శిల్పను కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు… రెండోరోజు ప్రశ్నించారు. పెట్టుబడుల పేరిట కోట్లాది రూపాయలు వసూలు డబ్బు ఎక్కడికి తరలించారనే కోణంలో విచారణ జరిపారు. ఎంతమంది నుంచి డబ్బు వసూలు చేశారు?..తీసుకున్న సొమ్మును ఏం చేశారనే కోణంలో ఆరా తీశారు. గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్‌లో ఉంటున్న శిల్ప దంపతులు అధిక వడ్డీలు అంటూ వీఐపీలను బురిడీ కొట్టించి కోట్లు వసూలు చేశారు. గత నెలలో వీరిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మోసాలకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ఇటీవల శిల్పను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు… ఆమె నుంచి సరైన సమాచారం సేకరించలేకపోయారు. దీంతో మరోసారి న్యాయస్థానం అనుమతితో శిల్పను కస్టడీలోకి తీసుకున్నారు.
మొదటిసారి పోలీసుల విచారణలో చెప్పిన సమాధానాలనే శిల్ప మళ్లీ చెబుతున్నట్టు సమాచారం. కిట్టీపార్టీల్లో పరిచయమైన వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయలను పెట్టుబడులుగా మలిచేందుకు కొందరు వ్యాపారులకు ఇచ్చినట్టు చెబుతున్నట్టు తెలుస్తోంది. శిల్ప చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆమె వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ కూడా శిల్పను ప్రశ్నించనున్నారు పోలీసులు. మరోవైపు శిల్ప బాధితులు ఒక్కోక్కరు బయటకు వస్తోన్నారు. తమ దగ్గర డబ్బులు తీసుకుందంటూ వరుసగా పీఎస్ కు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు.