తెలంగాణను ఉద్దరించటానికి ఈ మధ్యనే పుట్టిన YSRTP కి ఆదిలోనే హంసపాదులా అన్నీ షాక్‌లే … నిన్నటికి నిన్న ఇందిరా శోభన్ గుడ్‌బై చెప్పి షర్మిలకు షాకిచ్చారు. ఇప్పుడు దెబ్బ మరోలా తగిలింది. అదెలా అంటే.. సర్కార్ కొలువు దొరక్క నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ యువత జ్ఞాపకార్థంగా ఆమె ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్నారు. అలా బలవన్మరణం చెందిన వారి ఇంటికి వెళ్లి అక్కడే దీక్షకు కూర్చుంటున్నారు. అయితే ఆమె ఎవరికోసమైతే ఇదంతా చేస్తున్నారో వారి నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. అదే పెద్ద షాక్!!
షర్మిల ఈ దీక్షలతో ఆత్మహత్యల అంశాన్ని హైలైట్ చేయాలనుకున్నారు. వారి కష్టాలను ఎత్తిచూపాలని బావించారు. అందుకు.. ఎంపిక చేసిన తెలంగాణ గ్రామాల్లో ఉపవాస దీక్ష చేస్తున్నారు. వీటిని వేదికగా చేసుకుని కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. సర్కార్ పనితీరుపై ఆరోపణాస్ర్తాలు సంధిస్తున్నారు. తాజాగా ఆమె మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టాలనుకున్నారు. గ్రామానికి చెందిన పట్టభద్రుడు నరేశ్ ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న నిరాశతో బలవన్మరణం చెందాడు. నరేష్ జ్ఞాపకార్థం షర్మిల నిరాహార దీక్ష చేయాలనుకుంది. అయితే, నరేష్ తండ్రి తన ఇంటికి రావొద్దని కోరడంతో ఆమె షాక్‌కు గురైంది. ఆమె నుంచి తనకు ఎలాంటి సానుభూతి అక్కర్లేదని చెప్పాడు. ఇది షర్మిల సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న YSRTP నాయకులను కూడా షాక్‌కు గురి చేసింది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు వారికి. నరేష్ తో పాటు ఆయనకు మరో ముగ్గురు కొడుకులున్నారు. ముగ్గురూ సర్కార్ కొలువుల్లో ఉన్నారు. ఇప్పుడీ షర్మిల దీక్ష వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయేమో అని నరేష్ తండ్రి భయపడ్డాడు. దాంతో ఆమె తన ఇంటికి రావద్దని చెప్పేశాడు.
వైఎస్ షర్మిల దీక్షకు పూనుకుని ఏడు వారలవుతోంది. వారానికో గ్రామం వెళుతున్నారు. వెళ్లిన చోటల్లా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. స్థానిక టీఆర్‌ఎస్ కార్యకర్తలు దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుద్యోగ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని..మీకు అండగా ఉంటానని ఎంత చెప్పినా ఎందుకో ప్రజల నుంచి స్పందన కరువైంది. ఇదే వైయస్ షర్మిలను ఎక్కువ ఇబ్బంది పెడుతోంది.
ఇక పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఇందిరా శోభన్ గత శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఇది షర్మిలకు పెద్ద షాక్. పార్టీ పెట్టక ముందే కాంగ్రెస్ ని వీడి షర్మిల వెంట నడిచిన ఇందిర ఇంత హటాత్తుగా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు. సరైన ప్రాధాన్యత లేకపోవటం వల్లే రాజీనామా చేస్తున్నట్టు ఇందిర చెప్పారు. కానీ ఇది పైకి చెప్పే కారణం..తెరవెనక కథ ఇంకేదో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా వెనక్కి తీసుకోవాలని షర్మిల ఆమెకు ఫోన్ చేసినట్టు సమాచారం. ఇకపై బాగా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చారట. ఐనా ఇందిర ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇందిరా శోభన్ రాజీనామా వెనక రేవంత్ రెడ్డి ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమెను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రేవంత్‌కు సన్నిహితురాలైన ఎమ్మెల్యే సీతక్క కూడా ఇందిరతో మాట్లాడారని అంటున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కలిసివచ్చే ప్రతి అవకాశాన్ని రేవంత్ వదులుకోవట్లేదు. ఇందిర బాటలోనే మరికొందరు నడుస్తారని టాక్..
