ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం ఖానాపురం గ్రామాల్లో 89 వ రోజు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్రకు స్థానిక ప్రజలు వైఎస్సార్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పాదయాత్రలో గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులర్పించారు. గ్రామంలోని ప్రజలు రైతుల కోరిక మేరకు షర్మిల తలపాగా చుట్టి రైతు అవతారంలో ట్రాక్టర్ నడిపి వైఎస్సార్ అభిమానులను రైతులను ఆనందపరిచారు. గన్నవరం నుంచి ఖానాపూర్ వరకు ట్రాక్టర్ నడిపారు. గతంలో అనేకసార్లు మాజీ ముఖ్యమంత్రి, షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తలసాగాతో కనిపించారు. పాదయాత్రలోనూ ఆయన తలపాగా చుట్టారు.
తాజాగా వైఎస్సార్ తనయ తలపాగా చుట్టడంతో పాతరోజులు గుర్తుకువస్తున్నాయని అక్కడి స్థానికులు కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ని వైఎస్సార్ అభిమానులు రైతులు ఆమె వెనక ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని షర్మిల అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు. రెండురోజుల క్రితం షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. సరదాగా వైసీపీ నేతలతో కలిసి ఆయన ట్రాక్టర్ నడిపిన సంగతి తెలిసిందే.
మొన్న అన్న జగన్.. నిన్న చెల్లి షర్మిల
