ప్రధాని మోడీ ఇటీవల పార్లమెంట్‌లో చేసిన వివాదస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు ప్రధాని వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మోడీ దేశానికి ఏం చేశాం అనేది చెప్పకుండా నెహ్రూ మీద మాట్లాడారని, మోడీ మాటలు వింటుంటే సిగ్గు అనిపిస్తుందని ఆయన విమర్శించారు. మోడీ ప్రధాని లాగా కాకుండా.. చాయ్ వాలే లాగే మాట్లాడారని ఆయన ఎద్దేవా చేశారు.
విభజన హామీలు అమలు చేయకుండా.. కాంగ్రెస్ మీద ఆరోపణల చేశారని ఆయన అన్నారు. వ్యవసాయ చట్టాలు ఎవరితో చర్చించి తెచ్చావు..? నోట్ల రద్దు ఎవరిని అడిగి చేశారు..? అని మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మోడీ.. నెహ్రూ గురించి మాట్లాడుడు కాదు.. నీ రాజకీయ గురువు అద్వానీకి ఏ గతి పట్టించావు ? అని ఆయన ప్రశ్నించారు. తిరుపతి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చి మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
