September 17: అత్యంత కీలకమైన రోజుగా మారిన ‘సెప్టెంబర్ 17’ నేపథ్యంలో నగర పోలీసు శాఖ అత్యంత అప్రమత్తమైంది. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం నుంచి నగరంలోకి రానున్నారు. ఆదివారం బోయిన్‌పల్లిలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. మరోవైపు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి ఎదిగిన సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Read also: Women Success Story : బెండకాయలతో మహిళ వ్యాపారం.. ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు శాఖ గతంలో మాదిరిగా పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరేడ్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్స్ మధ్య ట్రాఫిక్ మళ్లింపు విధించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్ ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు మోహరింపులో పాల్గొంటున్నాయి. రెండు చోట్లా మొత్తం 2500 మంది సిబ్బందిని మోహరిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని నగరవాసులు సహకరించాలని, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, జేబీఎస్‌లకు వెళ్లే ప్రయాణికులు నిర్ణీత సమయానికి ముందే వెళ్లిపోవాలని పోలీసులు కోరారు.
Mammu Kaka: ‘భ్రమయుగం’ షూటింగ్ పూర్తి చేసిన మమ్ముట్టి
