ఆయనో బీసీ మంత్రి…. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ఆయనే.. వారి అసైన్డ్ భూములపై కన్నేశాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పేదలను భయపెట్టాడు.. నాయానో భయానో భూములు కాజేసేందుకు అధికారాన్ని అడ్డుగోలుగా వాడుకున్నాడు. మంత్రి దర్పాన్ని.. భూములు కాజేసేందుకు పేదలను భయపెట్టేందుకు వాడుకున్నాడు. కోళ్ల ఫామ్‌ల కోసం తోడేలుగా మారి రైతుల భూములను మింగేశాడు. అతనే తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్. ఆయన భార్య జమున పేరుతో హ్యాచరీస్ వ్యాపారం ఉంది. ఈ బిజినెస్‌ను విస్తరించుకునేందుకు… యథేచ్చగా భూఅక్రమణలకు తెరలేపారు. భూములు ఇవ్వకపోతే… ఈటల అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చెప్పిన రేటుకు అమ్ముకో.. లేదంటే ఉన్న భూమి కూడా దక్కదని వార్నింగ్ ఇస్తున్నారు. ఎకరా భూమి ఉన్న రైతులు, పేదలను కూడా వదలడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములను భూములను వదలడం లేదు. ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు.. స్వయంగా ఆ భూములను కలిగి ఉన్న రైతులే. ప్రభుత్వానికి తమ గోడు వెల్లబోసుకున్నారు రైతులు. తమ భూములను అనుచరులతో బెదిరిస్తూ ఈటల రాజేందర్ కాజేస్తున్నారని… తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారంటూ.. ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కన్నేశారు. వీరంతా దళితులు.. బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే. దాదాపు వంద ఎకరాలకుపైనే భూములను కబ్జా చేశారంటూ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు రైతులు. మంత్రిగా ఉండి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయకూడదని తెలిసినా… అక్రమంగా కొనుగోలు చేశారు. మరిన్ని భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. రైతులను బెదిరించారు. రెండు గ్రామాల్లో మంత్రి భూ ఆక్రమణలపర్వం సాగింది. 1994లో చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్య, చాకలి కృష్ణ, చాకలి నాగులు, చాకలి పరుశురాం కుటుంబాలకు 130/5, 130/9, 130/10 సర్వే నెంబర్లలో ఒక్కో కుటుంబానికి ఎకరం 20గుంటల చొప్పున ప్రభుత్వం భూములను కేటాయించింది. అలాగే ఎరుకల దుర్గయ్యకు సర్వే నెంబరు 64/6లో 3 ఎకరాలు, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములుకు కొంత భూమిని ప్రభుత్వం కేటాయించింది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు సూరి, యంజాల సుధాకర్‌రెడ్డిలు…అచ్చంపేట్, హకీంపేట్ గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూములను ఆక్రమించుకునేందుకు.. ఓ ప్రణాళిక ప్రకారం కబ్జాకు తెరలేపారు. భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ వారిని హడలగొట్టారు. వారితో పాటు దాదాపు వందమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన రైతుల భూకేటాయింపు పత్రాలను దౌర్జన్యంగా తీసుకున్నారంటూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈటల రాజేందర్ భూదాహానికి ఇరు గ్రామాల పరిధిలోని సుమారు వంద ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురయ్యాయని బాధిత రైతులు చెబుతున్నారు. కబ్జా చేసిన భూముల్లో నిబంధనలకు విరుద్దంగా పెద్ద పౌల్ట్రీ పరిశ్రమ స్థాపనకు… అక్రమ షెడ్లు నిర్మిస్తున్నారని రైతులు చెబుతున్నారు. అక్రమంగా భూములను ఆక్రమించడమే కాకుండా… వారి కార్యకలాపాలకు అడ్డుపడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు, వారి పరిసర ప్రాంతాల్లో భూములున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే నీ భూమిని మాకు అమ్ము… లేదంటే… నీ భూమికి శాశ్వతంగా దారిలేకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కున్న చెప్పుకోడంటూ…జులుం ప్రదర్శిస్తున్నారని వాపోతున్నారు. మంత్రి ఈటల రాజేందర్, అతని అనుచరుల కబంధహస్తాలకు గురైన, తమ అసైన్డ్ భూములను… తిరిగి ఇప్పించి…శాశ్వత హక్కులు కల్పించాలని కోరారు. చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్య, చాకలి కృష్ణ, చాకలి నాగులు, చాకలి పరశురాం, ఎరుకల దుర్గయ్య, ఎరుకల రాములు తదితరులు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. జమున హ్యాచరీస్ డైరెక్టర్, ఈటల రాజేందర్ తనయుడు ఈటల నితిన్‌రెడ్డి…హకీంపేట్‌లోని సర్వే నెంబరు 111/అ లోని ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొల్లి సీతారామారావు పేరుతో ఉన్న ఈ భూమిని రెగ్యులరైజ్ చేయాలంటూ అప్పటి అధికారులను సంప్రదించారు. కొల్లిచట్టం ప్రకారం కుదరదని చెప్పినా వినకుండా…బలవంతం చేసి…తమ పేర్లతో రెగ్యులరైజ్ చేయించుకున్నారు. అదేవిధంగా జమున హ్యాచరీస్ డైరెక్టర్, ఈటల రాజేందర్ సతీమణి జమున… అచ్చంపేటలోని సర్వే నెంబరు 81లో 5 ఎకరాల 36 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని ఆర్‌ఓఆర్ చట్టం-1989 ప్రకారం పట్టా మార్పిడి చేయాలని యెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. రికార్డులు పరిశీలించిన అధికారులు.. 5 ఎకరాల 36 గుంటల భూమిని కొల్లి సీతారామారావు నుంచి జమున పేరుకు బదిలీ చేశారు. ఎన్టీవీ ఈ ఎపిసోడ్‌ను మొత్తం బయటకు లాగడంతో.. సంచలనంగా మారింది.