NTV Telugu Site icon

మే నాటికి సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి : రజత్ కుమార్

సీతమ్మ సాగర్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి (ఇరిగేషన్‌) రజత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు సమావేశం నిర్వహించారు. రూ.3,480 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు అశ్వాపురం, చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని 63 గ్రామాల్లో 3121.14 ఎకరాల భూమి అవసరం. ఇప్పటి వరకు 2640.39 ఎకరాల భూమిని సేకరించగా అందులో 2485.18 ఎకరాల భూమిని నీటిపారుదల శాఖకు అప్పగించారు.

పరిహారంగా రూ.112.77 కోట్లు చెల్లించామని, మరో 740 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉందని, ఇందుకుగానూ రూ.59.20 కోట్లను భూ యజమానులకు పరిహారంగా చెల్లించాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇసుకను సమకూర్చారు. నిర్మాణ పనులకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. 36.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించే ప్రాజెక్టుకు 65 గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని రజత్ కుమార్ తెలిపారు.