ములుగు జిల్లాలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి అక్కడ నుంచే ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పర్యాటకులు తమ ఆనంద యాత్రను విషాదంగా మార్చుకోకుండా, తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం, పోలీసు , అటవీ శాఖ అధికారులు జారీ చేస్తున్న సూచనలు, హెచ్చరికలను పాటించాలని ఆ సందేశంలో విజ్ఞప్తి చేశారు.
ప్రకృతి సంపదకు నిలయం ములుగు
ములుగు జిల్లా ప్రకృతి సంపదకు నిలయమని, దట్టమైన అడవులు, గోదావరి పరీవాహక ప్రాంతం, బొగత జలపాతం, అందమైన సెలయేళ్లు, చారిత్రక , ఆధ్యాత్మిక క్షేత్రాలు ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సమ్మక్క-సారలమ్మల మేడారం, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ సురక్షితంగా వచ్చి, సంతోషకరమైన జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
నిషేధిత ప్రాంతాలకు వెళ్లడంపై ఆందోళన
ఇటీవల ములుగు పరిధిలోని నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మంత్రి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దట్టమైన అడవులు, ప్రమాదకరమైన జలపాతాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు , వేగంగా ప్రవహించే వాగులు, సెలయేళ్ల వద్దకు వెళ్లవద్దని ఇప్పటికే పోలీసులు, అటవీశాఖ అధికారులు విస్తృతంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ కొందరు పర్యాటకులు ఉత్సాహంతో బ్యారికేడ్లను దాటి నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సెల్ఫీల కోసం ప్రాణాలను రిస్క్ చేయవద్దు
పర్యాటకుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటరాదని, హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా గౌరవించాలని కోరారు. ముఖ్యంగా డీప్ ఫారెస్ట్ ప్రాంతాలు, లోతైన జలపాతాలు, కొండల అంచుల వద్ద సెల్ఫీలు లేదా వీడియోల కోసం ప్రాణాలను రిస్క్ చేయవద్దని సూచించారు. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే భద్రతా నిబంధనలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా, ఆనందంగా ఉంటుందని, ప్రతీ ఒక్కరూ తమతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల భద్రత పట్ల బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

