Secunderabad Army : ఆర్మీ ఆయుధాల మిస్సింగ్ కేసు.. ఐదు రోజులు గడిచినా మిస్టరీనే.!

  • 60 మందిని విచారించినా దొరకని క్లూ
  • ఆఫ్‌లో ఉన్న CCTVలతో దర్యాప్తుకు చిక్కులు
  • 12 ఎంట్రీ-ఎగ్జిట్ మార్గాలపై నిఘా
  • సివిలియన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాల జల్లెడ
Secunderabad Army

Secunderabad Army

Secunderabad Army : సికింద్రాబాద్ ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల మిస్సింగ్ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా దర్యాప్తులో ఎలాంటి కీలక పురోగతి లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. మిలటరీ ఇంటెలిజెన్స్, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), స్థానిక పోలీసులు కలిసి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

60 మందిని విచారించిన అధికారులు

ఆయుధాలు రెజిమెంట్‌ పరిధిలోని వ్యక్తులే ఎత్తుకెళ్లి ఉండొచ్చనే అనుమానంతో అధికారులు తొలుత ‘ఇంటి దొంగల’ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 60 మందిని విచారించినప్పటికీ కీలక ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. రెజిమెంట్ లోపల, బయట అనుమానితుల కదలికలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు కనిపించకపోవడంతో దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారింది.

ఆఫ్‌లో ఉన్న సీసీ కెమెరాలతో చిక్కులు

ఆయుధాలు మిస్సైన పరిసర ప్రాంతాల్లోని కొన్ని సీసీ కెమెరాలు ఆ సమయంలో పనిచేయకపోవడం దర్యాప్తుకు మరో అడ్డంకిగా మారింది. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ఆర్మీ క్యాంప్ నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లడం అంత సులభం కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయుధాలను క్యాంప్‌ నుంచి బయటకు ఎలా తరలించారనే అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

సివిలియన్ రాకపోకలపై నిఘా

ఆర్మీ ఏరియా నుంచి సివిలియన్ ప్రాంతాలకు జరిగే రాకపోకలపై అధికారులు దృష్టి పెట్టారు. ఆర్మీ జోన్‌లోకి వెళ్లేందుకు, బయటకు రావడానికి సుమారు 12 ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఉన్నట్లు గుర్తించారు. మల్టిపుల్ ఎంట్రీ పాయింట్ల కారణంగా ప్రతి మార్గాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేయడం దర్యాప్తు బృందాలకు సవాల్‌గా మారింది.

బయటకు తరలించారా?

ఆయుధాలను చోరీ చేసిన తర్వాత వాటిని ఏదైనా సివిలియన్ వ్యక్తి ద్వారా ఆర్మీ ఏరియా నుంచి బయటకు పంపి ఉండవచ్చనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మీ క్యాంప్ చుట్టుపక్కల ఉన్న సివిలియన్ ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను జల్లెడ పడుతున్నారు. ఆయుధాల చోరీకి సంబంధించి ఏదైనా అనుమానాస్పద కదలిక కనిపించిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆయుధాల కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో కేసు ఎటు దారితీస్తుందన్నది ఉత్కంఠగా మారింది.