బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మన బడికి కేంద్రం నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారని, కార్యక్రమానికి రూ. 2700కోట్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన పైసలు ఎక్కడ విడ్‌త్రా చేసుకోవాలో బండి సంజయ్ చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఒక పక్క టెట్ వాయిదా వేయాలంటూనే మరో 20వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటున్నారని, బండి సంజయ్ బాధ్యతగా మాట్లాడితే మంచిదన్నారు. ఉపాధ్యాయులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా జీతాలు పెంచామన్నారు. ఉపాధ్యాయులు మానసిక క్షోభకు గురవుతున్నారన్న దుష్రచారం మానుకోవాలని సూచించారు. రాష్ట్రానికి నవోదయ స్కూల్స్, గిరిజన వర్సిటీని తెచ్చి బండి సంజయ్ మాట్లాడాలని చురకలంటించారు.
దమ్ముంటే విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ప్రధాని నరేంద్ర మోడితో మాట్లాడి ఇకనైనా న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పట్ల అడుగడుగునా వివక్ష చూపుతోందని, దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్నింటా మొండి చేయి చూపుతోందని మంత్రి ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఐఐటి, ఐఐఎం, నిడ్, వైద్య కళాశాల, నవోదయ పాఠశాల ఒక్కటి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పరంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు ఎవరూ ప్రశ్నించేందుకు ధైర్యం చూపడం లేదని, ఏ ఒక్క రోజు తెలంగాణకు ఒక్క ప్రతిష్టాత్మక విద్యా సంస్థనయినా ఇవ్వాలని అడగలేదని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పాఠశాలల స్థాయి పెంపు, పెద్ద ఎత్తున గురుకులాల ఏర్పాటు, కొత్తగా జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, యూనివర్సిటీలను ప్రారంభించి విద్యా రంగాన్ని రాష్ట్ర సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజులను, కాస్మోటిక్ చార్జీలతో సహా ఇతర సౌకర్యాలను కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు.
బేటీ పడావో- బేటీ బచావో నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మోడల్ స్కూళ్ళను ఎత్తివేసిన ఘనత ఈ కేంద్ర ప్రభుత్వానిది కాదా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి చెందుతూ విద్యారంగంలో అద్భుతాలు సృష్టిస్తోందని, దీనిని ప్రశంసించకపోగా బండిసంజయ్ పచ్చి అబద్దాలు చెబుతూ విమర్శలు చేయడం దారుణమని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చేవి చెప్పకుండా యుపిఎ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సర్వశిక్ష అభియాన్‌ను ఇప్పుడు ప్రస్తావించి, మన ఊరు-మనబడికి, దానికి సంబంధం ఉందని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
విద్యారంగానికి కేంద్రం నుంచి చేయుతనివ్వకపోగా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు అవాకులు చవాకులు మాట్లాడటం బండి సంజయ్ ఇకనైనా మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఇప్పటికైనా ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థను ఒక్కటైనా కేంద్రం నుంచి మంజూరు చేయించి మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. విద్యారంగానికి రాజకీయాలతో ముడిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన బడిబాటలో బిజెపి నాయకులు కూడా పాల్గొనాలని, ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ చదువును అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.
