రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ, లబ్దిదారులకు దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడు కోట్లు మంజూరైనట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా గురుకుల పాఠశాలలో సుమారుగా నాలుగు లక్షల మంది పిల్లలు చదువుతున్నారని, 12 వందల కోట్లతో పాఠశాలకు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్య శాఖలో త్వరలో 20 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నట్లు,దళితులు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఆమె వెల్లడించారు. దళిత బంధు లాగా మిగతా వర్గాలకు కూడా త్వరలో అభివృద్ధి పథకాలు అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
