తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన చుట్టూ ఉన్నవారికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నా అని ముందుంటారు. మొన్నామధ్య ముడిమ్యాల క్యాసారం గేట్ల మధ్య ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదే సమయంలో వికారాబాద్ పర్యటన ముగించుకుని మొయినాబాద్ వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద స్థలం వద్ద తన కాన్వాయ్ అపి క్షతగ్రాతులను ప్రత్యేక వాహనంలో తరలించారు. అంతేకాకుండా ఆ తరువాత ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి యోగక్షేమాలపై ఆరా తీశారు.
అయితే తాజాగా మరోసారి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శనివారం రోజున మామిడిపల్లి మీదుగా వెళ్తుండగా కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులను చూశారు. దీంతో వెంటనే తన కాన్వాయ్ అపి ఆ పిల్లలను తన దగ్గరకు పిలిచి చాక్లెట్లు, మంచినీళ్లు ఇచ్చి వారి వివరాలపై ఆరా తీశారు. వెంటనే స్థానిక నేతకు ఫోన్ చేసి ఆ చిన్నారులకు షూలు, సాక్స్ జతలు ఇప్పించారు. దీంతో విద్యార్థులు సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.