వీఆర్‌ఎస్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్పీలో చేరారు.. ఈ సందర్భంగా నల్గొండ వేదికగా భారీ బహిరంగసభ నిర్వహించారు.. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి బలప్రదర్శన చేశారు.. జనసమీకరణకు విద్యార్థుల నుంచి వివిధ వర్గాల వరకు ఆయనకు మద్దతు లభించింది.. బహిరంగసభకు హాజరైన జనాన్ని చూస్తే.. వాళ్లు పెట్టిన ఎఫెక్ట్ కనిపిస్తుంది.. అయితే, ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి తహసీల్దార్ రాధపై బదిలీ వేటు పడడం చర్చగా మారింది.. పీఏ పల్లి తహసీల్దార్ ఎం. దేవదాస్‌ను నార్కట్ పల్లికి… పి.రాధను పీఏ పల్లికి బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సభ విజయవంతంలో కీలక పాత్ర పోషించారనే రాధపై చర్యలు తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
ఇక, ఈ వ్యవహారంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించడంతో.. ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది.. తహసీల్దార్ రాధ బదిలీపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రవీణ్ కుమార్.. “ఈ రోజు ఒక మంచి ఆఫీసర్, నార్కెట్‌పల్లి తహసీల్దారు శ్రీమతి రాధ గారిని హుటాహుటిన మారుమూల మండలానికి బదిలీ చేశారు.. ఆమె భర్త మా పార్టీలో నేతనేనా? ప్రతిపక్షంలో ఉండడం నేరమా? బహుజన బిడ్డలపై కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకింత పగ?” అని ప్రశ్నించిన ఆయన.. “నల్గొండ సభ కేవలం ఆరంభం మాత్రమే.. దానికే ఇంత ఉలిక్కి పడ్తున్రు..” అంటూ సెటైర్లు వేశారు.