Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!

  • ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం సమావేశం
  • పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులపై స్పష్టమైన హామీలు
Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల చిరకాల కోరికలైన పీఆర్సీ (PRC), రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులపై ప్రభుత్వం స్పష్టమైన హామీలను ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన కీలక భేటీలో ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి టైమ్ లైన్ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

వంద రోజుల్లో రూ. 6 వేల కోట్లు..
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రాబోయే 100 రోజుల్లో రూ.6,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నిధులను ఏయే ప్రాధాన్యతలకు ఖర్చు చేయాలనే నిర్ణయాధికారాన్ని ఉద్యోగ సంఘాలకే వదిలేస్తున్నట్లు ఆయన తెలపడం విశేషం. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ, ఇప్పటికే ప్రతి నెల ఒకటో తారీఖునే వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై తక్షణమే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారుల కమిటీని ఆదేశించారు. ఆ రిపోర్టు ఆధారంగానే పీఆర్సీపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే జూన్ 1వ తేదీ లోగా ఉద్యోగులందరికీ కొత్త ఆరోగ్య భద్రత కార్డులను అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఉద్యోగుల కోసం మరిన్ని నిర్ణయాలు..
గత రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగ సంఘాలు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం కల్పించామని సీఎం తెలిపారు. ప్రతి రెండు నెలలకోసారి గుర్తింపు పొందిన సంఘాలు సమావేశమై, సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని, గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలను తాము కసరత్తు చేసి క్లియర్ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం నాటి పెండింగ్ బిల్లులను సున్నా చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి మానవీయ దృక్పథంతో సమస్యలను పరిష్కరిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.