NTV Telugu Site icon

Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్.. విక్రమార్కుడులో రవితేజ, బ్రహ్మానందం లెక్క

Revanth Reddy On Trs Bjp

Revanth Reddy On Trs Bjp

Revanth Reddy Satires On BJP TRS Parties: బీజేపీ, టీఆర్ఎస్‌లది మిత్రబేధమని.. విక్రమార్కుడులో రవితేజ, బ్రహ్మానందం పాత్రల లెక్క ఆ పార్టీల మధ్య బంధం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందరికీ గుండు కొట్టి పంపకాల పంచాయతీ పెట్టినట్టు.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పంచాయతీ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అసలు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎవరో ఇస్తే.. దానిపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు లొల్లి చేయడం ఏందని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపణలు చేశారు.

ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో తాము గెలిచామని టీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటోందని, కానీ స్వతహాగా తాము గెలవలేదని పరోక్షంగా ఒప్పుకున్నారని.. కమ్యూనిస్టుల శరణుతో గెలిచారని రేవంత్ రెడ్డి చురకలంటించారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు లేరని చెప్పిన సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు వాళ్లే దిక్కు అయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పుడు పరాన్నజీవి అయ్యారని కౌంటర్ వేశారు. ఇక బీజేపీ బరితెగించిందని, నడి బజారులో నగ్నంగా నిలబడిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యంతో పాటు వందల కోట్లు డబ్బులు పంచి.. మునుగోడుని మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలబెట్టిందన్నారు. టీఆర్ఎస్ కూడా తక్కువేం కాదని.. ఆ రెండు పార్టీలు కలిసి రూ. 300 కోట్ల మద్యం తాగించారని ఆరోపణలు చేశారు. అయితే.. ఈ పాపంలో తమ పాత్ర లేదని తెలిపారు.

ఎన్నికల సంఘంతో ఎలాంటి ఉపయోగం లేదని మునుగోడు ఎన్నికలు నిరూపించాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. మాయా పాచికలో పాండవులు ఓడిపోయినప్పుడు కౌరవులు సంతోషించారు.. కానీ కురుక్షేత్రంలో పాండవులే గెలిచారని గుర్తు చేశారు. మునుగోడు ఎన్నికలతో టీఆర్ఎస్, బీజేపీ ఓటమికి పునాది పడిందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌కు ఓట్లు రాలేదని నిరాశలో ఉన్నానన్న ఆయన.. కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడ్డారని, కాంగ్రెస్ శ్రేణుల కృషి అభినందనీయమని కొనియాడారు. తమ పోరాట పటిమలో లోపం లేదని చెప్పారు. ఇదే సమయంలో గవర్నర్ vs ప్రభుత్వం వివాదంపై మాట్లాడుతూ.. గవర్నర్ కూడా ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొద్దని, బీజేపీ నాయకుల బాధ్యత నిర్వహించాలనుకోవడం సమంజసం కాదని హితవు పలికారు.

ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగించిందని.. ఉదయించే సూర్యుడిలాగా రాహుల్ గాంధీ తెలంగాణలోకి ఎంటరయ్యారని రేవంత్ రెడ్డి తెలిపారు. చరిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం ఆయనకు ఘనంగా స్వాగతం పలికిందన్నారు. అపనమ్మకంతో ఉన్న సమాజానికి రాహుల్ భరోసా కల్పించారన్నారు. జోడో యాత్రలో తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించానని అనుకుంటున్నానని.. జోడో యాత్ర స్పూర్తితో జనంలోకి వెళతామని.. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.