టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా కేసీఆర్, కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ.. ట్విట్టస్త్రాలు సంధించారు. వరంగల్ రింగు రోడ్డు (డబ్ల్యూఆర్ఆర్) పేరిట టీఆర్ఎస్ మరో లూటీకి తెర తీసిందంటూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్లర్‌లో ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు వరంగల్ రింగు రోడ్డు పేరిట వరంగల్ పరిధిలోని సారవంతమైన భూములను రైతుల నుంచి లాక్కునేందుకు ఇప్పటికే తమ రియల్ ఎస్టేట్ మాఫియాను రంగంలోకి దించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుల నుంచి అతి తక్కువ ధరకే వందలు, వేల ఎకరాల భూములను లాగేసుకున్నారని ఆయన అన్నారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌పై కీలక ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే.. గోవా మాజీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగంబర్ కామత్ బుధవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కామత్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై రేవంత్‌కు ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.