తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం ప్రత్యేక పర్యటనలో భాగంగా గోవాకు చేరుకున్నారు. గోవా కాంగ్రెస్ కమిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’లో (Save Goa Campaign) ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా కున్కోలిమ్ నియోజకవర్గ పరిధిలోని ప్రాచీన చీఫ్టెన్స్ స్మారకం (Chiefs Memorial) నుంచి కున్కోలిమ్ బస్టాండ్ వరకు సాగే సుదీర్ఘ పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. పాదయాత్ర అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారు. అనంతరం ఈ రాత్రికి గోవా నుంచి నేరుగా హస్తినకు పయనమై దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు.
గోవా వారసత్వ పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ యాత్ర
గోవా సంస్కృతి, భూములు, పర్యావరణం బోయింగ్ స్థానిక గుర్తింపును కాపాడే లక్ష్యంతో గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత నెల 22న రాజధాని పనాజీలో ఈ ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’ ప్రారంభమైంది. మొత్తం 27 రోజుల పాటు సాగే ఈ బృహత్తర పాదయాత్ర రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నెల 18న ఈ యాత్ర అధికారికంగా ముగియనుంది. స్థానిక గోవా సంస్కృతి, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా ఉన్న చర్యలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రను చేపట్టింది.
బీజేపీ ప్రభుత్వ విధానాలపై చైతన్య పోరాటం
ప్రస్తుతం గోవాలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం నింపడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ ప్రయోజనాల కోసం స్థానిక భూములను, పర్యావరణాన్ని బలిచేస్తున్నారని ఆరోపిస్తూ గోవా కాంగ్రెస్ ఈ పాదయాత్ర ద్వారా నిరసన తెలుపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యాత్రలో భాగస్వామ్యం కావడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండటంతో పాటు యాత్రకు మరింత ప్రాధాన్యత లభించింది.

