Site icon NTV Telugu

Revanth Reddy: ఓటు అడుగుతున్న రాజగోపాల్ రెడ్డికే మునుగోడులో ఓటు లేదు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy Fires On Rajagopal Reddy In Munugode By Election Campaign: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తనకు ఓటు వేయమని అడుగుతున్న రాజగోపాల్ రెడ్డికే ఓటు లేదని, అసలు ఇక్కడ ఊరు కూడా లేదని, అలాంటి వ్యక్తికి మునుగోడు ప్రజలంతా ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఇంతకుముందు కాంగ్రెస్ తరఫున 22 వేల మెజార్టీతో గెలిచి, ఇప్పుడు 22 వేల కోట్ల కాంట్రాక్టుకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడని ఆరోపించారు. ఈరోజు తాము గొప్పోళ్లమని చెప్పుకొని తిరుగుతున్న నాయకులు.. 2009కి ముందు వాళ్లెవరో కూడా ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ఖతం చేయాలన్న ఉద్దేశంతో బొడ్డులో కత్తి పెట్టుకుని తిరిగిన నేతలను తమ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల పదవులు ఇచ్చిందని అన్నారు.

మునుగోడులో తమ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరిన రేవంత్ రెడ్డి.. మునుగోడు నియోజకవర్గాన్ని తానే దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను మునుగోడుకు తీసుకువస్తానన్నారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఐదు వేల కోట్ల నిధులు ఇప్పిస్తానని, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యతేనని మాటిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి, అభివృద్ధికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం పలికారు. అంతకుముందు.. బీజేపీ మంత్రాలకు చింతకాయలు రాలవన్న ఆయన.. టీఆర్ఎస్ తంత్రాలకు ప్రజల సమస్యలు తీరవంటూ విమర్శలు గుప్పించారు. తమ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.

Exit mobile version