CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!

  • రూ.8.11 లక్షల కోట్ల అప్పులు
  • ఏటా రూ.90 వేల కోట్ల భారం
  • ఉద్యోగుల కోసం ఎన్నో చర్యలు
  • ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో 16 మంది ముఖ్యమంత్రులు కలిసి 60 ఏళ్లకు పైగా పాలించినా రాష్ట్ర అప్పులు రూ.70 వేల కోట్లుగా ఉండేవని, కేసీఆర్ మాత్రం తొమ్మిదేళ్ల పాలనలో అప్పులను భారీగా పెంచారని ఆరోపించారు. రూ.70 వేల కోట్ల అప్పును రూ.8.11 లక్షల కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు. ప్రస్తుతం ఆ అప్పులకు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లింపుల కోసం ప్రతి నెలా భారీ మొత్తాన్ని కేటాయించాల్సి వస్తోందని అన్నారు.

ఏటా రూ.90 వేల కోట్లు చెల్లిస్తున్నాం

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల కారణంగా ఏడాదికి సుమారు రూ.90 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న సమయంలోనే డిసెంబర్ 7న ప్రభుత్వం తమ చేతుల్లోకి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం తమపై భారీగా ఆర్థిక భారాన్ని మోపి వెళ్లిందని విమర్శించారు.

ఉద్యోగులకు చేసిన పనులు ఇవే..

ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రిటైర్మెంట్ బకాయిల రూపంలో రూ.6 వేల కోట్లను వంద రోజుల్లో చెల్లించామని తెలిపారు. కేసీఆర్ హయాంలో నిలిచిపోయిన పీఆర్సీని తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్య భద్రత కార్డులను పునరుద్ధరించామని చెప్పారు.

ఆర్టీసీకి రూ.11 వేల కోట్ల చెల్లింపులు

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం విషయంలోనూ తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని రేవంత్ తెలిపారు. 32 నెలల్లో ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నప్పటికీ ఆర్టీసీకి ఆర్థిక నష్టం రాకుండా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోందని వివరించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు చనిపోయినా పట్టించుకోలేదని కేసీఆర్‌పై విమర్శలు చేశారు.

ఉద్యోగులు ఒక్కసారి ఆలోచించాలి

2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని సీఎం అన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో ఆరు నెలల పాటు జీతాలు ఆలస్యమయ్యేవని, ఇప్పుడు ఐదో తేదీకే జీతాలు అందుతున్నాయని పేర్కొన్నారు. రిటైర్మెంట్ వయసు పెంపు, రూ.8 వేల కోట్ల బకాయిల భారాన్ని కూడా గత ప్రభుత్వం తమపై వదిలి వెళ్లిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులు గత పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులను పోల్చి చూడాలని సూచించారు.