రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రకృతి విపత్తులు, కరువు పరిస్థితులు, రాజకీయ పరిణామాలు మరియు గత ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టమైన విశ్లేషణ చేశారు. కరువు ప్రారంభంలో చిన్నగా అనిపించినా, జూలై నాటికి తీవ్ర రూపం దాల్చుతుందని, తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోనూ కరువు ప్రభావం ఉందని, అక్కడ కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు.
ఈ సంక్షష్ట సమయంలో బీఆర్ఎస్ నేతల మాటలను నమ్మి రైతులు ఎవరూ మోసపోవద్దని సీఎం హితవు పలికారు. గతంలో కరోనా సమయంలో కేసీఆర్ ‘క్రోసిన్ వేసుకుంటే పోతుంది’ అంటూ బాధ్యతారహితంగా మాట్లాడారని, ఆ మాటలు నమ్మి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. ఇప్పుడు హరీష్ రావు మాటలు నమ్మి పంటలు వేస్తే నష్టపోతారని, హరీష్‌ను నమ్ముకుంటే పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఎద్దేవా చేశారు. కరోనా విపత్కర కాలంలో పేదలకు ఉపాధి హామీ పథకమే అండగా నిలిచిందని గుర్తుచేశారు. మోడీ లాగా చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి అని తాము చెప్పబోమని, క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. ఓటు హక్కు కల్పించిన మంచి ఉద్దేశాన్ని మోడీ తన పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. SIR పేరుతో లబ్ది పొందాలని మోడీ ప్రయత్నిస్తున్నారని, ఆయన కుట్రలను రాహుల్ గాంధీ నాయకత్వంలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కొత్త కాదని, కొన్నిసార్లు ఓడిపోయినా రెట్టింపు ఉత్సాహంతో తిరిగొచ్చామని అన్నారు. త్వరలో ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఊహించని విధంగా పెరిగిందని సీఎం తెలిపారు. ఏకంగా 20 వేల మెగావాట్లకు పైగా పీక్ డిమాండ్ నమోదైందని, కష్టమైనా సరే రైతులను ఆదుకోవడానికి విద్యను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు తమపై విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మూడు నెలల క్రితమే కరువు పరిస్థితులపై అప్రమత్తం చేసిందని, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

